హైదరాబాద్ : వచ్చే అక్టోబర్ నెలలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన డీజీపీలతో విస్తృత సమావేశం జరుగుతుందని వెల్లడించారు తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్. ఆయన పోలీస్ శాఖపై సమీక్ష చేపట్టారు. గత కొన్ని నెలలుగా ప్రారంభించిన ముఖ్యమైన విధాన పరమైన చర్యలు , శాఖ ఎదుర్కొంటున్న ఇతర పరిపాలనా, కార్యాచరణ సమస్యలపై చర్చించడానికి, శాఖలోని అత్యున్నత అధికారులైన స్టాఫ్ ఆఫీసర్ల నెలవారీ సమావేశాన్ని నిర్వహించే సంప్రదాయాన్ని పునరుద్ధరించడం కొనసాగుతోందని చెప్పారు డీజీపీ. ఇటీవలి మానవ వనరులు, వాహనాల తనిఖీలు, వనరుల ఆప్టిమైజేషన్ స్పష్టమైన ఫలితాలను ఇచ్చాయని అన్నారు. మావోయిజం అంతం కావడంతో అనవసరమైన భద్రతను ఉపసంహరించు కోవడం వల్ల 376 మంది సిబ్బంది, 20 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, 7 ఫార్చ్యూనర్లు, 18 ఇన్నోవా క్రిస్టాలు , 58 ఇతర నాలుగు చక్రాల వాహనాలు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు.
వీటిని ఇప్పుడు అత్యంత అవసరమైన సంస్థలలో తిరిగి కేటాయించడం జరిగిందన్నారు. గ్రేహౌండ్స్ , ఆక్టోపస్ల పునర్వ్యవస్థీకరణ ద్వారా 573 మంది సిబ్బందికి ఇవ్వాల్సిన 60% అదనపు జీతాన్ని ఉపసంహరించడం జరిగిందన్నారు డీజీపీ. వీరిని ఏసీబీ, సీఐడీ, నార్కోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, విజిలెన్స్ , సివిల్ సప్లైస్ ఎన్ఫోర్స్మెంట్, ఆహార కల్తీ , ట్రాఫిక్ , రోడ్డు భద్రత వంటి అవసరమైన విభాగాలకు పునః పంపిణీ చేయడం ద్వారా సుమారు ₹28.16 కోట్లు ఆదా అయ్యాయని వెల్లడించారు. ఇలాంటి ఇతర చర్యల వల్ల ప్రభుత్వానికి నికరంగా సుమారు ₹90 కోట్ల ఆదా చేకూరిందన్నారు. అవసరమైన సంస్థలు , కొత్త విభాగాలలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మంజూరైన 93,000 మంది తెలంగాణ పోలీసుల సంఖ్యను హేతుబద్ధీకరించడం గురించి కూడా ఆలోచించడం జరుగుతోందన్నారు డీజీపీ సీవీ ఆనంద్.
