ప్రత్యేక ఎన్‌ఆర్‌ఐ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి

సీఎంను క‌లిసి విన్న‌వించిన ఝాన్సీ రెడ్డి

హైద‌రాబాద్ : తెలంగాణలో ప్రత్యేక ఎన్‌ఆర్‌ఐ (ప్ర‌వాస భార‌తీయ‌) కమిషన్‌ను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ పౌరుల ప్రయోజనాలను పరిరక్షించడానికి, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి రాష్ట్రంలో తక్షణమే ఒక ప్రత్యేక నాన్-రెసిడెంట్ ఇండియన్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని విన్న‌వించారు. ఈ మేర‌కు సీఎంకు విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అమెరికా, గల్ఫ్ దేశాలు, యూరప్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో ఉన్న తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు పెట్టుబడులు, రెమిటెన్స్‌లు, సాంకేతికత, దాతృత్వం, విద్య, వైద్య రంగాల ద్వారా రాష్ట్ర పురోగతికి నిరంతరం గణనీయమైన సహకారాన్ని అందిస్తున్నారని కొనియాడారు. అయితే ఎన్‌ఆర్‌ఐలు , వారి కుటుంబాలు స్వరాష్ట్రంలో ఆస్తి వివాదాలు, భూ సమస్యలు, పత్రాల చిక్కులు, మోసపూరిత లావాదేవీలు, కుటుంబ అత్యవసర పరిస్థితులు, చట్టపరమైన సహాయం, విదేశీ సంక్షోభాల సమయంలో ప్రభుత్వ శాఖలతో నేరుగా సమన్వయం చేసుకోవడంలో తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు.

ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం-ఎన్‌ఆర్‌ఐల మధ్య అనుసంధాన ‘సింగిల్-విండో’ వ్యవస్థగా పనిచేసేలా ప్రతిపాదిత ఎన్‌ఆర్‌ఐ కమిషన్ పది కీలక బాధ్యతలను నెరవేరుస్తుందని వివరించారు. ఎన్‌ఆర్‌ఐలు, వారి కుటుంబాల కోసం ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయడం, ఆస్తి, భూమి , చట్టపరమైన విషయాల్లో సహాయ పడటంతో పాటు ఆస్తుల మోసపూరిత లావాదేవీలు, ఇతర రకాల దోపిడీల నుండి రక్షణ కల్పించడం ఈ కమిషన్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అలాగే విదేశాల్లో ఉన్న తెలంగాణ పౌరులు ఎదుర్కొనే అత్యవసర పరిస్థితుల్లో తక్షణ మార్గదర్శకత్వం, సమన్వయం అందించడం , విదేశీ తెలంగాణ సంస్థలకు-రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు మధ్య బలమైన అనుసంధానాన్ని ఏర్పాటు చేయడం ఇందులో భాగమని పేర్కొన్నారు.మరోవైపు పారదర్శకమైన సింగిల్-విండో వ్యవస్థ ద్వారా తెలంగాణలో ఎన్‌ఆర్‌ఐ పెట్టుబడులు, వ్యవస్థాపకత, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, పర్యాటకం, విద్య, ఆరోగ్య సంరక్షణ , దాతృత్వ కార్యక్రమాలను ప్రోత్సహించడం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఆర్‌ఐల సమగ్ర డేటాబేస్ , కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం కూడా జరుగుతుందన్నారు. దీంతో పాటు భారత ప్రభుత్వం, భారతీయ రాయబార కార్యాలయాలు , కాన్సులేట్లు , విదేశీ కమ్యూనిటీ సంస్థలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, ఎన్‌ఆర్‌ఐల ఆందోళనలు , సూచనలను అర్థం చేసుకోవడానికి క్రమానుగతంగా ఎన్‌ఆర్‌ఐ సమావేశాలు, సంప్రదింపులను నిర్వహించ వచ్చని స్పష్టం చేశారు.

దేశంలోని అనేక ఇతర రాష్ట్రాలు ఇప్పటికే ఎన్‌ఆర్‌ఐల కోసం ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేశాయని, తెలంగాణ కూడా వేగంగా పెరుగుతున్న తన గ్లోబల్ కమ్యూనిటీ అవసరాలకు అనుగుణంగా బలమైన నమూనాను తయారు చేయగలదని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. సమర్థవంతమైన ఎన్‌ఆర్‌ఐ కమిషన్ ద్వారా తెలంగాణకు ప్రపంచ పెట్టుబడులు, జ్ఞానం, సాంకేతికత, ఉపాధి అవకాశాలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలు లభిస్తాయని చెప్పారు. ఈ ప్రతిపాదిత కమిషన్ నిర్మాణం, బాధ్యతలు , పరిష్కార చట్రంపై ఎన్‌ఆర్‌ఐ ప్రతినిధులతో కలిసి చర్చించేందుకు తమ బృందం సిద్ధంగా ఉందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి, గ్లోబల్ డయాస్పోరాకు మధ్య సంబంధాన్ని మరింత బలపరిచే ఈ చొరవపై సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!