సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి

డిఆండ్ చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైద‌రాబాద్ : దేశంలో గత కొన్నేళ్లుగా కుట్ర పూరితంగా పౌరుల ఓటు హక్కును కాలరాస్తూ ‘ఓట్ల చోరీ’ జరుగుతోందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పదే పదే చేసిన హెచ్చరికలు నేడు నిజమని తేలిపోయాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్ పేరుతో పౌరుల ఓట్లను తొలగిస్తున్న తీరుపై ఇతర కమిషనర్లే స్వయంగా అంగీకరించడం దేశ ప్రజాస్వామ్యానికి పట్టిన దురదృష్టకర పరిణామమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సిఈసి) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని అన్నారు. ఏఐసీసీ పిలుపు మేర‌కు సోమ‌వారం టీపీసీసీ ఆధ్వ‌ర్యంలో బిఆర్‌కే భవన్ వద్ద ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ శ్రేణులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టాయి. ఈ కార్యక్రమంలో చేతిలో భారత రాజ్యాంగ ప్రతిని పట్టుకుని పాల్గొన్నారు డిప్యూటీ సీఎం. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్‌లతో కలిసి ఆయన ఎన్నికల కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించారు.

అనంత‌రం భ‌ట్టి మీడియాతో మాట్లాడారు. దేశంలో రాజ్యాంగాన్ని, పౌరుల ఓటు హక్కును కాపాడటానికి రాహుల్ గాంధీ మొదటి నుంచీ పోరాడుతున్నారని ప్రత్యేకంగా గుర్తు చేశారు. ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నేడు స్వయంగా ఎన్నికల కమిషనర్లే ఒప్పుకోవాల్సి వచ్చిందని, ప్రజాస్వామ్యానికి ప్రాణ వాయువైన ఓటు హక్కునే కాలరాస్తే ఇక ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని విశ్వసించే రాజకీయ పార్టీలన్నీ విభేదాలను పక్కనపెట్టి కాంగ్రెస్‌తో చేతులు కలపాలని కోరారు. రాజ్యాంగంపై నమ్మకం లేని వారు మాత్రమే ఈ ఉద్యమానికి దూరంగా ఉంటున్నారని విమర్శించారు. భారత ప్రజాస్వామ్యంపై, పౌరుల హక్కులపై కాంగ్రెస్‌కు సంపూర్ణ విశ్వాసం ఉందన్న ఆయన, ప్రతీ పౌరుడికీ వారి ఓటు హక్కు దక్కేంత వరకు పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!