మూసీ ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు

నిప్పులు చెరిగిన ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాము చేప‌ట్ట‌బోయే మూసీ ప్రాజెక్టుకు ఎవ‌రైనా అడ్డంకులు సృష్టిస్తే చ‌ర్య‌లు తప్ప‌వంటూ హెచ్చ‌రించారు. ఆదివారం నల్గొండలో జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి బీఆర్ఎస్ , బీజేపీ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయా పార్టీల పాలన తీరుపై చర్చించేందుకు రాష్ట్ర అసెంబ్లీ , శాసనమండలి ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని ఆయన సవాలు విసిరారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన, కేంద్రంలో బీజేపీ 12 ఏళ్ల పాలన , కాంగ్రెస్ ప్రభుత్వ 30 నెలల పనితీరుపై చర్చించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. మూడు పార్టీల పనితీరు , ఎన్నికల హామీలపై చర్చించడానికి ప్రత్యేక సమావేశాలు నిర్వహించడానికి మేము సిద్ధం అని ప్ర‌క‌టించారు.

ప్రతిపక్షాలు స్పీకర్ , మండలి చైర్మన్‌కు లేఖ రాయాలి. సభలోనే ఈ అంశాన్ని తేల్చుకుందాం అని ఆయన అన్నారు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు పట్ల తన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని పునరుద్ఘాటించారు ముఖ్యమంత్రి. ఈ కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలను సహించేది లేదని హెచ్చరించారు. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టును సమర్థించారు. మూసీ ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించే వారిని మూసీ నదిలోనే పడేస్తాం అని ఆయన వ్యాఖ్యానించారు. మూసీ పరివాహక ప్రాంతంలో కాలుష్యం గురించి ప్రస్తావిస్తూ, కలుషిత నీటి వల్ల ఆ ప్రాంతంలో తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, నల్గొండలో పుట్టిన పిల్లల్లో పుట్టుకతోనే వైకల్యాలు సంభవించే పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!