మామిడి రైతుల‌కు ఏపీ స‌ర్కార్ భ‌రోసా

స్ప‌ష్టం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు

అమరావతి : తోత‌పూరి మామిడి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు న్యాయమైన ధర లభించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తోత‌పూరి మామిడి ప్రస్తుత సీజన్ పరిస్థితులు, మామిడి గుజ్జు (పల్ప్) ప్రాసెసింగ్, కొనుగోలు ఏర్పాట్లపై వర్చువల్ విధానంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో విజ‌య‌వాడ‌లోని క్యాంప్ కార్యాల‌యం నుండి మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు 78 వేల హెక్టార్లలో తోత‌పూరి సాగు జరుగుతోందని, ఈ పంటపై వేలాది మంది రైతుల జీవనోపాధి ఆధారపడి ఉందన్నారు. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఈ ఏడాది కొంత మేర దిగుబడి తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందన్నారు.

గత సీజన్‌లో కోకాకోలా, పార్లే, పెప్సీ వంటి ప్రముఖ పానీయాల సంస్థలు పెద్ద ఎత్తున మామిడి పల్ప్ కొనుగోలు చేయడం ద్వారా రైతులకు మేలు జరిగిందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది కూడా గత సంవత్సరం మాదిరిగానే కొనుగోలు ఆర్డర్లు ఇవ్వాలని ఆయా సంస్థలను కోరారు. మామిడి పల్ప్ ప్రాసెసింగ్ యూనిట్లు వ్యాపారుల ద్వారా కాకుండా నేరుగా రైతుల నుంచే పండ్లను కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. తోత‌పూరి పండ్ల కొనుగోలు విషయంలో రైతుల్లో ఎలాంటి అపోహలు, ఆందోళనలు లేకుండా అధికారులు, సిబ్బంది విస్తృత ప్రచారం చేపట్టాలని మంత్రి సూచించారు. పూర్తిగా పరిపక్వత చెందిన నాణ్యమైన ప్రతి పండును కొనుగోలు చేస్తామని, చివరి పండు వరకు రైతులకు మార్కెట్ సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ప్ర‌క‌టించారు. పండ్ల నాణ్యత మెరుగుదలకు తోడ్పడే ఫ్రూట్ కవర్ల వినియోగాన్ని విస్తృత స్థాయిలో ప్రోత్సహించాలని తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!