అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. శ్రీవాణి నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న 5 వేల దేవాలయాలను వచ్చే 2 ఏళ్లల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఆలయాల నిర్మాణ పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి కమిటీ వేయాలని సీఎం సూచించారు. రాష్ట్ర సచివాలయంలో దేవాదాయ శాఖపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. శ్రీవాణి నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు నిర్మించాలని గతంలోనే నిర్ణయించడం జరిగిందని చెప్పారు. ఈ ఆలయాల నిర్మాణ బాధ్యత జిల్లా యంత్రాంగానికి అప్పగించాలని ఆలోచన చేస్తున్నాం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలోనూ 25-30 వరకూ ఆలయాలను నిర్మించే అవకాశం ఉంటుందన్నారు సీఎం. స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుని ఆలయాల నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. వారి నుంచి ప్రతిపాదనలు తీసుకుని నిర్మాణం చేపట్టాలని సూచించారు.
ఆలయాల నిర్మాణానికి సంబంధించి మూడు రకాల డిజైన్లతో పైలెట్ ప్రాజెక్టుగా నిర్మించాలని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. వీటి నిర్మాణానికి సంబంధించి త్వరితగతిన అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతీ దేవాలయానికీ ప్రహరీ నిర్మాణం చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రం లోని 22 ప్రముఖ దేవాలయాలకు మాస్టర్ ప్లాన్లు రూపొందించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, పెనుగంచిప్రోలు, శ్రీకాళహస్తి, కాణిపాకం దేవాలయాలకు మాస్టర్ ప్లాన్లు సిద్దంగా ఉన్నాయన్నారు. మిగిలిన దేవాలయాలకు కూడా మాస్టర్ ప్లాన్‌లను త్వరితగతిన రూపొందించాలని ఆదేశించారు.
