మద్యం బాబులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఝలక్
రోడ్డు భద్రతను పటిష్టం చేసేందుకు విస్తృత తనిఖీలు
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు జనాభా పెరుగుతోంది. మరోవైపు ట్రాఫిక్ జాం నరకం చూపిస్తోంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఫుల్ ఫోకస్ పెట్టారు. మద్యం సేవించి వాహనాలను నడిపే వారికి ఝలక్ ఇస్తోంది. ముఖ్యంగా రోడ్డు భద్రతను పటిష్టం చేసేందుకు మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. నగరంలో రోడ్డు భద్రతను మెరుగు పరచడానికి, ప్రమాదాలను నివారించడానికి గాను పోలీసులు ఈ నెల 10, 11వ తేదీలలో రెండు రోజుల పాటు పెద్ద ఎత్తున ‘డ్రంక్ అండ్ డ్రైవ్’పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ మొత్తం 466 మంది వాహనదారులు పట్టుబడ్డారు. వీరిలో 404 మంది ద్విచక్ర వాహనదారులు, 23 మంది త్రిచక్ర వాహనదారులు, 39 మంది నాలుగు చక్రాల వాహన చోదకులు ఉన్నారు.
రక్తంలో ఆల్కహాల్ శాతం (BAC Levels) ఆధారంగా నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే. 30-50 మధ్య 97 కేసులు, 51-100 మధ్య 163 కేసులు, 101-150 మధ్య 108 కేసులు, 151-200 మధ్య 47 కేసులు, 201-250 మధ్య 34 కేసులు, 251-300 మధ్య 5 కేసులు మరియు 300 పైన ఆల్కహాల్ శాతం నమోదైన వారు 12 మంది ఉన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారి పట్ల హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం ‘జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తుందని, ఈ ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని జాయింట్ కమిషనర్ స్పష్టం చేశారు. వాహనదారులు నిబంధనలు పాటిస్తూ రోడ్డు భద్రతకు సహకరించాలని కోరారు. లేకపోతే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.
