హైదరాబాద్ : హైడ్రా హైదరాబాద్ లో దూకుడు పెంచింది. నగరం నలువైపులా భారీ ఆపరేషన్లను నిర్వహించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాల్లో ఒకే రోజు 840 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. వీటి విలువ రూ. 30 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. భారీ పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులతో కలిసి హైడ్రా ఈ భారీ ఆపరేషన్లను నిర్వహించింది. తప్పుడు పత్రాలతో, సర్వే నంబర్లతో వందల ఎకరాలు కాజేయాలని చేస్తున్న వారి ప్రయత్నాలకు హైడ్రా చెక్ పెట్టింది. ఇందులో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడ గ్రామంలోని 25, 26 సర్వే నంబర్లలో 650 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా ఇదే జిల్లాలోని శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో 84 ఎకరాల ప్రబుత్వ భూమికి హైడ్రా ఫెన్సింగ్ వేసింది. మేడ్చల్ – మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాల పరిధిలోని కంటోన్మెంట్ 106 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకుంది. శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం విలేజ్‌లోని సర్వే నంబరు 46లో ఉన్న 84 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ వేసింది. ఇలా మొత్తం 840 ఎకరాల ప్రభుత్వ భూమిని శనివారం హైడ్రా కాపాడింది.
రాయదుర్గంలోని మల్కం చెరువు ఎదురుగా కొండలు, గుట్టలు, పచ్చని చెట్లతో సహజ సిద్ధంగా ఉన్న ప్రభుత్వ భూమిని కాజేయాలని చాలామంది ప్రయత్నం చేస్తుండగా.. ఆ భూమికి మార్కింగ్ వేసి ఫెన్సింగ్ వేసింది. రాయదుర్గం ఐటీ కారిడార్‌లో టి.హబ్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఈ భూమికి ఆనుకుని ఉన్న ప్రైవేటు పట్టాకు చెందిన అర ఎకరం భూమిని ఓ సంస్థకు ఆ స్థల యజమాని అమ్మారు. ఆ పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి కూడా తక్కువ ధరకు అమ్మేయ్ నేను కొనేస్తాను అని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలా సర్వే నంబరు 46లోని 84 ఎకరాల ప్రభుత్వ భూమిలోకి చొరబడి ఎకరం భూమి వరకూ కాజేశారు. రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయింది. గుట్టలు, కొండల మాటున గుట్టుగా కబ్జాల పర్వం కొనసాగించాలనుకునే వారికి రెవెన్యూ, హైడ్రా అధికారులు చెక్ పెట్టారు. ఎకరం రూ. 200ల కోట్ల వరకూ ఉండే ఈ భూమి కబ్జాలకు ఆస్కారం లేకుండా చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది.
