చెన్నై : తమిళనాడులో కొత్తగా కొలువు తీరిన టీవీకే పార్టీ సర్కార్ నేరస్తులు, డ్రగ్స్ ముఠాపై ఉక్కుపాదం మోపింది. సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేపట్టారు. ఏకంగా 3,246 మంది రౌడీ మూకలతో పాటు 419 మంది మాదక ద్రవ్య నేరస్థులను అరెస్ట్ చేశారు. ఈ ప్రత్యేక ఆపరేషన్ రౌడీయిజం, మాదకద్రవ్యాల వ్యాపారం , వ్యవస్థీకృత నేర ముఠాలను లక్ష్యంగా చేసుకుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలను పటిష్టం చేయడం, ప్రజల భద్రతను , శాంతిని కాపాడటమే ప్రధాన లక్ష్యంగా సాగుతోందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) స్పష్టం చేశారు.
నేరాల నియంత్రణకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన భారీ అణచివేత చర్యల్లో భాగంగా గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా సాగిన ప్రత్యేక ఆపరేషన్లలో భారీ ఎత్తున రౌడీలను, మాదకద్రవ్య నేరస్థులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. రౌడీయిజం, మాదకద్రవ్యాల వినియోగం, ఇతర మత్తు పదార్థాల దుష్ప్రభావాల నుండి సమాజాన్ని విముక్తం చేయడమే పోలీసు శాఖ సంకల్పం అని కుండ బద్దలు కొట్టారు. ఈ ఆపరేషన్ సమయంలో తమిళనాడు పోలీసులు మొత్తం 15,349 మంది రౌడీ మూకలను తనిఖీ చేశారు; వీరిలో 12,650 మంది ‘హిస్టరీ షీట్స కలిగిన వారు కాగా, 2,699 మంది ‘హిస్టరీ షీట్’ లేని (Non-HS) వ్యక్తులు ఉన్నారని డీజీపీ పేర్కొన్నారు.
అదే సమయంలో 844 మంది వ్యక్తులను వివిధ చట్టపరమైన నిబంధనల కింద రిమాండ్‌కు తరలించారు. NDPS చట్టం కింద మాదకద్రవ్యాలపై చేపట్టిన సమాంతర చర్యల్లో భాగంగా, ఇదే కాలంలో తమిళనాడు వ్యాప్తంగా పోలీసులు 294 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 267.756 కిలోల గంజాయిని , 2,476 మాదకద్రవ్య మాత్రలను కూడా స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్లో వీటి అంచనా విలువ రూ. 1,43,78,200 ఉంటుందని భావిస్తున్నారు.