సచ్చిదానంద సరస్వతి బ్రహ్మైక్యం జగన్ రెడ్డి సంతాపం
ఆయన లేక పోవడం అత్యంత బాధాకరమన్న మాజీ సీఎం
అమరావతి : ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తుని తపోవనం మఠాధిపతులు శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి వారు బ్రహ్మైక్యం చెందడంపై స్పందించారు. ఆయన లేక పోవడం పట్ల సంతాపం తెలిపారు. ఘనంగా నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం జగన్ రెడ్డి సంతాప సందేశం సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు . తపోవనం మఠాధిపతులు, ఆధ్యాత్మిక మార్గదర్శకులు శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి వారు పరమ పదించడం అత్యంత దురదృష్టకరం. స్వామి వారి మరణవార్త ఆధ్యాత్మిక వర్గాల్లోనే కాక అందరికీ తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని అన్నారు.. స్వామి వారు జీవితాంతం ధర్మ ప్రచారం, వేద సంస్కృతి పరిరక్షణ, సేవా కార్యక్రమాలకు అంకితభావంతో పని చేశారంటూ ప్రశంసలు కురిపించారు.
తపోవనం మఠాన్ని ఆధ్యాత్మిక సాధనకు కేంద్రంగా తీర్చి దిద్దడంలో విశేష కృషి చేశారని పేర్కొన్నారు జగన్ రెడ్డి. వేలాది భక్తులకు ఆధ్యాత్మిక చైతన్యం తీసుకువచ్చి, సద్గుణాల మార్గంలో నడిపించారని ప్రశంసించారు.. స్వామి వారి ఉపదేశాలు సనాతన ధర్మం, సత్యం, సేవ, సమానత్వం అనే విలువలపై నిలిచేవన్నారు. సమాజంలోని బలహీన వర్గాల పట్ల వారు చూపిన కరుణ, సేవా కార్యక్రమాలు చిరస్మరణీయాలని పేర్కొన్నారు జగన్ మోహన్ రెడ్డి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, భక్తులకు , మఠ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నట్లు తెలిపారు. స్వామి వారి ఆశయాలు, ఆధ్యాత్మిక బోధనలు ఎప్పటికీ మనకు మార్గదర్శకంగా నిలుస్తాయని వైయస్ జగన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
