వైభ‌వంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వసంతోత్సవాలు

మూడు రోజుల పాటు అంగ‌రంగ వైభ‌వంగా ఉత్స‌వాలు

తిరుపతి : శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజుల పాటు అపూర్వ వైభవంగా నిర్వహించిన వసంతోత్సవాలు భక్తి జనసంద్రంలో ఘనంగా ముగిశాయి. వేద ఘోషాలు, మంగళ వాయిద్యాలు, గోవింద నామ స్మరణల మధ్య ఆలయం ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడింది. ఉత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్ర నామార్చనలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.అనంతరం ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు శ్రీ భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీసీతా రామ లక్ష్మణ ఆంజనేయస్వామి, రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వారి ఉత్సవ మూర్తులను వసంత మండపంలో వేంచేపు చేసి ఆస్థానం వైభవంగా నిర్వహించారు.

మధ్యాహ్నం 1.45 నుండి 3.30 గంటల వరకు జరిగిన స్నపన తిరుమంజనం భక్తులను మంత్ర ముగ్ధులను చేసింది. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రాజోపచారాల అనంతరం పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీరు, పసుపు, గంధంతో స్వామి, అమ్మవార్లకు మహాభిషేకం నిర్వహించారు. చక్రధార, శంఖధార, సహస్రధార, మహాకలశాభిషేకాలను వైఖానస ఆగమరీతిలో అర్చకులు ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం తదితర వేదమంత్రాలు మారుమోగగా ఆలయ ప్రాంగణం దివ్యానుభూతిని కలిగించింది. ఏడు రకాల సుగంధ పుష్పమాలలతో స్వామి, అమ్మవార్లను అర్చకులు సుందరంగా అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాగా సాయంత్రం ఊంజల్ సేవ అనంతరం రాత్రి ఆలయ నాలుగు మాడ వీధుల్లో స్వామి, అమ్మవార్లు విహరించి భక్తులకు దర్శనం ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మీ, సూపరింటెండెంట్ రమేష్ బాబు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు మునికుమార్, ధనశేఖర్, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!