పెనుకొండ/శ్రీసత్యసాయి జిల్లా : తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నుముక అని, పసుపు జెండా మోసిన వారిని పార్టీ అధిష్టానం ఎప్పుడూ ప్రాధాన్యమిస్తూనే ఉంటుందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. మళ్లీ మళ్లీ కూటమి ప్రభుత్వమే రాష్ట్రంలో వచ్చేలా కార్యకర్తలందరూ పనిచేయాలని, కూటమిలోని ఇతర పార్టీలతో కలుపుకు పోవాలని పిలుపునిచ్చారు. దోపిడి, విధ్వంసం జగన్ క్రెడిట్ అని, వాటిని చోరీ చేయాల్సిన దౌర్భాగ్యం తమకు లేదని మంత్రి సవిత స్పష్టం చేశారు. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్స వేడుకలు పెనుకొండలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ సర్కిల్ అన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
టీడీపీ ఆవిర్భావం నుంచి ప్రజా సంక్షేమానికి పార్టీ కార్యకర్తలు నిబద్ధత, నిజాయితీతో పని చేస్తున్నారని అన్నారు సవిత. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అనే సిద్దాంతంతో అన్నఎన్టీఆర్ ఇదే రోజు టీడీపీని స్థాపించారన్నారు. నాడు ఒక్కరితో ప్రారంభమైన ప్రయాణం నేడు కోటి మందితో అతి పెద్ద కుటుంబంగా టీడీపీ ఆవిర్భవించిందన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ నిరంతరం కష్టపడుతున్నారని చెప్పారు. వారి నేతృత్వంలో టీడీపీ మరింత బలోపేతమైందన్నారు. 5 ఏళ్ల జగన్ పాలనలో ఎన్ని కేసులు పెట్టినా, ఎంత వేధించినా టీడీపీ కార్యకర్తలు భుజాన ఉన్న పసుపు జెండాను దించని యోధులని మంత్రి సవిత కొనియాడారు.
