హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనా కాలంలో అందినంత మేర కల్వకుంట్ల కుటుంబం అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు . శాసన సభ సాక్షిగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాసనసభకు రాని కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. జీతం తీసుకుంటూ ఇంట్లోనే కూర్చుంటే ఎలాగని ప్రశ్నించారు. సిగ్గుంటే ఆయనతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటిపై ఆరోపణలను కొట్టిపారేవారు. దమ్ముంటే బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, తన్నీరు హరీష్ రావులు తమ వద్ద ఆధారాలుంటే సీబీసీఐడీకి ఇవ్వాలని సవాల్ విసిరారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి.
“గురివింద గింజ తన కింద నలుపు ఎరుగదన్నట్లు” విపక్షాల తీరు ఉందని ఎద్దేవా చేశారు. పేదల కోసం పనిచేసే తమ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదమని మండిపడ్డారు. ఇప్పటి వరకు 1 కోటి పది లక్షలు జీతం తీసుకుని కనీసం అసెంబ్లీకి కూడా రాని మాజీ సీఎం చంద్రశేఖర రావును రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంట్లో పడుకున్నఆయన ప్రజల సొమ్మును తినడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
రోజూ 18 గంటలు పనిచేస్తూ రాష్ట్ర మంతటా తిరుగుతూ ప్రజలకోసం పనిచేస్తూ.. లక్షలాది దళిత గిరిజన ఆదివాసిలకు ఇండ్లిచ్చి వారి ఇండ్లలో వెలుగు, కళ్ళల్లో ఆనందం నింపుతున్న మంత్రి పొంగులేటి రాజీనామా చేయమనడానికి సిగ్గుండాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
