పెనుకొండ/శ్రీసత్యసాయి జిల్లా : రాయలసీమలో రక్తం ఏరులై పారించిన చరిత్ర నీది, నీ తాతది, నీ తండ్రిది.. నీ బాబాయ్ హంతకులు, దళితులను పొట్టన బెట్టుకున్న వారు నీ పార్టీలోనే ఉన్నారు కదా.. మహాత్మా గాంధీ, గౌతమ బుద్ధుడిలా నువ్వు శాంతి వచనాలు పఠిస్తే రాష్ట్రంలో నమ్మేవాళ్లెవరూ లేరు అని జగన్ పై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్ సైకో పాలనతో అయిదేళ్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారన్నారు. రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని అంత మొందించి, ఇక్కడి బిడ్డలను ఐటీ, ప్రభుత్వ ఉద్యోగులుగా, వ్యాపారులుగా తీర్చిదిద్దిన ఘనత సీఎం చంద్రబాబు దేనన్నారు. మంత్రి నారా లోకేశ్ గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదన్నారు. పెనుకొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. తాడేపల్లి ప్యాలెస్ లో నిర్వహించిన జగన్ ప్రెస్ మీట్ ను చూసి జనాలు నవ్వుకుంటున్నారన్నారు. మహాత్మా గాంధీ, గౌతమ బుద్ధుడిలా జగన్ రెడ్డి శాంతి వచనాలు పఠించడం చూసి, చిన్న పిల్లలతో పాటు రాజకీయ అవగాహన లేని వారు సైతం నవ్వుతున్నారన్నారు.
రాయలసీమలో ఫ్యాక్షన్ కు నాంది పలికింది రాజారెడ్డి అని ఆరోపించారు మంత్రి ఎస్. సవిత. జగన్, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తాత రాజారెడ్డి చరిత్ర అందరికీ తెలిసిందేనన్నారు.. ఫ్యాక్షన్ నైజంతో రాయలసీమలో రక్తం ఏరులై పారించారని, వారి రక్త దాహానికి బడుగు, బలహీన వర్గాల వారు, రాజకీయ ప్రత్యర్థులు బలైపోయారని అన్నారు. శవ రాజకీయాలు చేయడంలో జగన్ తరవాతే ఎవరైనా అని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ గతంలో అనలేదా..? అని ప్రశ్నించారు. తండ్రి శవాన్ని రాజకీయ ఉనికి కోసం ఉపయోగించు కోలేదా..? అని జగన్ ను మంత్రి సవిత నిలదీశారు. తల్లిని, చెల్లెళ్లను సైతం ఏడిపిస్తున్నారని మండిపడ్డారు. బాబాయ్ హంతకులు, దళిత సామాజిక వర్గానికి చెందిన డ్రైవర్ సుబ్రహ్మాణ్యాన్ని పొట్టన బెట్టుకున్న వ్యక్తి వైసీపీలోనే ఉన్నారని మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ అయిదేళ్ల పాటు రాష్ట్ర ప్రజలను తీవ్ర ఇబ్బందులు పాల్జేశారన్నారు.