నెల్లూరు జిల్లా : మత్స్య కారుల సేవలో బహిరంగ సభా వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ, ఉద్యాన శాఖల స్టాళ్లను ముఖ్యమంత్రి తిలకించారు. అలాగే సీవీడ్, తీర ప్రాంత నిఘా కేంద్రాన్ని సందర్శించారు. తీర ప్రాంతంలో సముద్రపు నాచు సాగు చేసేలా మత్స్య కార మహిళలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ సందర్బంగా సీఎం ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీఎస్ఎంసీఆర్ఐ సహకారంతో మత్స్యకార మహిళలు అదనపు ఆదాయం పొందేలా సీవీడ్ కల్చర్ చేసేందుకు శిక్షణ ఇవ్వనున్నారు. తీరప్రాంతాల్లో మహిళలు సముద్రంలో సీవీడ్ సాగు చేసేలా శిక్షణతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ మేరకు మత్స్యకార మహిళల శిక్షణకు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలో నిరంతర పర్యవేక్షణ కోసం జాయింట్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఫర్ సీ పెట్రోలింగ్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి సందర్శించారు.
మెరైన్ పోలీస్, మత్స్యశాఖ, అటవీశాఖ, స్థానిక మత్స్య కారులతో సంయుక్తంగా సీ పెట్రోలింగ్ జాయింట్ యాక్షన్ టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల మత్స్యకారుల బోట్లు చొరబడకుండా గస్తీ కోసం శాటిలైట్ చిత్రాల సాయం తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. డ్రోన్ల ద్వారా గస్తీ నిర్వహించి హెచ్చరికలు జారీ చేసే సాంకేతిక వ్యవస్థను అధికారులు సీఎం ఎదుట ప్రదర్శించారు. ఏపీ సరిహద్దుల్లోని సముద్ర జలాల్లోకి ప్రవేశించిన పొరుగు రాష్ట్రాల బోట్లకు తెలుగు, తమిళం ఇతర భాషల్లో హెచ్చరికలు జారీ చేసేలా డ్రోన్లను వినియోగిస్తున్నట్టు అధికారులు సీఎంకు వివరించారు. స్థానిక మత్స్య కార బోట్లు అంతర్జాతీయ జలాల్లోకి వెళ్లినప్పుడు హెచ్చరికలు వచ్చే జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను సీఎం పరిశీలించారు. ఇక స్థానికంగా పండిన మామిడి కాయలను పరిశీలించిన ముఖ్యమంత్రి రైతును అభినందించారు. డీఆర్డీఓ, వెపన్ సిస్టమ్స్ తయారీ కంపెనీల స్టాళ్లను సీఎం సందర్శించారు.
