ఆక్టోపస్ కంటే వేగంగా దేశ వ్యాప్తంగా విస్తరించిన కాషాయానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. గెలుపే మంత్రంగా ముందుకు సాగుతూ వచ్చిన భారతీయ జనతా పార్టీకి ఇది ఊహించని షాక్. అన్నీ తానై ముందుండి నడిపించిన ప్రధాని నరేంద్ర మోదీకి ఇది ఓ గుణ పాఠం. ఒంటి చేత్తో ఫలితాలను తారు మారు చేయడమే కాదు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించే సామర్థ్యం కలిగిన ఏకైక నాయకుడిగా చక్రం తిప్పుతున్న ట్రబుల్ షూటర్ అమిత్ చంద్ర షా పాచికలు పారలేదు. జేపీ నడ్డా చాణక్యం వర్కవుట్ కాలేదు. వెరసి ప్రజల్ని కరెన్సీ నోట్లతో కొనగలమని , తాము ఏది చెబితే అది వింటారని, తమకే అధికారం మరోసారి ఖాయమని ఊహల్లో తేలియాడిన కాషాయ శ్రేణులకు దిమ్మ తిరిగేలా జవాబు ఇచ్చారు జనం.
భారత రాజ్యాంగం పట్ల, ప్రత్యేకించి ప్రజాస్వామ్యం పట్ల అత్యంత హేయ్య భావాన్ని కలిగి ఉన్న బీజేపీకి ఇప్పుడు కర్ణాటకలో వెల్లడైన ఫలితాలు ఒకింత మింగుడు పడడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు గుప్పించినా బీజేపీ ప్రభుత్వం ఎందుకని సీట్లు తెచ్చుకోలేక పోయిందనేది పునరాలోచించు కోవాలి. ప్రతి పనికి కమీషన్ నిర్ణయించిన ఘనత మూటగట్టుకుంది. ఆపై బలహీనమైన వ్యక్తిని సీఎం పదవిలో కూర్చోబెట్టడం కూడా మరో కారణం. ఇక ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అయితే బీఎల్ సంతోష్ లేదంటే అమిత్ షా. కాదంటే జేపీ నడ్డా. ఎన్నికలకు ముందు కోట్లాది రూపాయలు కుమ్మరించినా . అభివృద్ది పనుల పేరుతో ..నెపంతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసినా..హామీలు గుప్పించినా చివరకు ప్రధానిని నమ్మలేదు. అసలు బీజేపీని దరిదాపుల్లోకి రానీయకుండా చేశారు కన్నడిగులు.
కులం, మతం, విద్వేషం నినాదంగా మారి పోయిన ఈ తరుణంలో అవే ఎన్నికల్లో అస్త్రాలుగా మారాయి. కానీ ఇవి కావు తమకు కావాల్సింది ప్రజలను ప్రేమించే , ఆదరించే వాళ్లు కావాలని కోరుకున్నారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదంటూ మోదీ పరివారం , దానిని మోస్తున్న మీడియా బాకాలు ఊదినా, ప్రచారం చేసినా చివరకు అంచనాలు మించి కాంగ్రెస్ 136 సీట్లను కైవసం చేసుకుంది. ఇది దేనికి సంకేతం. బీజేపీ పతనానికి నాంది అనుకోవడానికి వీలులేదు. కానీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర దామోదర దాస్ మోదీ కొలువు తీరుతారని ప్రకటన చేసిన అమిత్ షా ఇప్పుడు డైలమాలో పడ్డారు. దర్యాప్లు సంస్థల పేరుతో ఎంత కాలం వేధంపులకు పాల్పడతారు. సకల వ్యవస్థలను నిర్వీర్యం చేసి కేవలం కార్పొరేట్ కంపెనీల జపం చేస్తూ పోతే చివరకు ఏం మిగులుతుంది..అప్పులు తప్ప..
అందుకే ఓటర్లు తమకు ఏం కావాలో ముందే నిర్ణయించుకున్నారు. ఇరు పార్టీలు పోటా పోటీగా హామీలు గుప్పించినా చివరకు బీజేపీ పాలనలో విసిగి పోయిన వారంతా అంతిమ తీర్పు వెలువరించారు. ఇక కాషాయం వద్దే వద్దంటూ స్పష్టం చేశారు. ఓటు శాతం మారక పోవచ్చు..కానీ బీజేపీ ఓటమికి తానే కారణమని చెప్పక తప్పదు. దీనిని కాంగ్రెస్ విజయంగా భావించక పోవచ్చు. అది పక్కన పెడితే అంతులేని అవినీతి, పనికో రేటు, కేంద్రం ఆధిపత్యం..వెరసి గాడి తప్పిన పాలన, మతం ముసుగులో వేధింపుల పర్వం చివరకు పతనం చెందేలా చేసింది. చిల్లర రాజకీయాలు ఎల్లకాలం పని చేయవు..అంతిమంగా ప్రజాస్వామ్యమే గెలుస్తుందని చరిత్ర చెప్పిన సత్యం. దీనికి కర్ణాటక ప్రజలను మెచ్చుకోకుండా ఉండలేం.
