ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతులెత్తేసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం ఆతిథ్య జట్టుకు అచ్చి రాలేదు. ఇక్కడ జరిగిన ఏ మ్యాచ్ లోనూ రాజస్థాన్ ఆశించిన రీతిలో రాణించ లేదు.
ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది రాజస్థాన్ రాయల్స్ ముందు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ ఏ కోశానా ఎదుర్కోలేక చేతులెత్తేసింది. కేవలం 10.3 ఓవర్లలో 59 పరుగులకే చాప చుట్టేసింది. ఆర్సీబీ బౌలర్ల దెబ్బకు విల విల లాడింది. ప్రపంచ క్రికెట్ లో టాప్ బ్యాటర్లుగా పేరు పొందిన ఆటగాళ్లంతా పెవిలియన్ కు క్యూ కట్టారు. ఐపీఎల్ లో అత్యంత తక్కువ స్కోర్ నమోదు చేసిన జట్టుగా రాజస్థాన్ నిలిచింది.
ఆర్సీబీ బౌలర్లలో వేన్ పార్నెల్ అద్భతుమైన బౌలింగ్ తో కట్టడి చేశాడు. ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 3 ఓవర్లు మాత్రమే వేసి 10 రన్స్ ఇచ్చి కీలకమైన 3 వికెట్లు తీశాడు. రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించాడు. యశస్వి జైస్వాల్ , జోస్ బట్లర్ గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగారు. కెప్టెన్ సంజూ శాంసన్ లేని షాట్ కోసం ప్రయత్నం చేసి 4 పరుగులకు ఔట్ అయ్యాడు. ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే రాణించారు. జో రూట్ 10 రన్స్ చేస్తే షిమ్రోన్ హిట్మెయర్ 35 పరుగులు చేశాడు.
