MLA Seethakka Comment : ‘సీత‌క్క’ సీఎం అవుతుందా..?

రేవంత్ రెడ్డి కామెంట్స్ తో క‌ల‌క‌లం

MLA Seethakka Comment : ఎవ‌రీ సీత‌క్క ఏమిటా క‌థ అనుకుంటున్నారా. తానా వేదిక‌గా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. కాంగ్రెస్ ప‌వ‌ర్ లోకి రావ‌డం ఖాయ‌మ‌ని, అవ‌స‌ర‌మైతే సీత‌క్క(Seethakka) సీఎం అవుతుంద‌ని , ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నాడు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు కాంగ్రెస్ పార్టీలో క‌ల‌క‌లం రేపాయి. ఇప్ప‌టికే బుల్లెట్ లాంటి రేవంత్ రెడ్డి మీద సీనియ‌ర్లు గుర్రుగా ఉన్నారు. మ‌రికొంద‌రు పైకి అన‌క పోయినా లోలోప‌ట మ‌ధ‌న ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం టీపీసీసీ అంటేనే రేవంత్ అన్న స్థాయికి తీసుకు వ‌చ్చేలా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యాడు టీపీసీసీ చీఫ్‌. ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా లోని క‌ల్వ‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎలా మాట్లాడాలో , ఎలాంటి కామెంట్స్ చేస్తే త‌ను హాట్ టాపిక్ గా మారుతాడ‌నే విష‌యం బాగా తెలుసు.

ఇది ప‌క్క‌న పెడితే ఇంత‌కీ సీత‌క్క ఎవ‌రు అంటే ఆదివాసీ బిడ్డ‌. ప్ర‌జ‌ల కోసం ఉద్య‌మించిన నాయ‌కురాలు. అంత‌కు మించి నిబ‌ద్ద‌త క‌లిగిన ప్ర‌జా ప్ర‌తినిధి. ఆమె క‌రోనా క‌ష్ట కాలంలో ప్ర‌జా ప్ర‌తినిదులంతా బ‌తుకు భ‌యంతో, అధికారం ఉంద‌నే మ‌దంతో భ‌వంతుల‌కే ప‌రిమిత‌మైతే సీత‌క్క(Seethakka) మాత్రం త‌ను ప్రాత‌నిధ్యం వ‌హిస్తున్న ములుగు నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జ‌ల‌కు అందుబాటులో సేవ‌లు అందించింది. అంతకు మించి వ‌ర‌ద‌ల్లో సైతం ప్రాణాల‌ను లెక్క చేయ‌కుండా అడ‌వి బాట ప‌ట్టింది. అక్క‌డ సాయం కోసం ఎదురు చూస్తున్న మ‌ట్టి బిడ్డ‌ల‌కు తాను కూతురైంది..త‌ల్లైంది..ఆస‌రాగా నిలిచింది.

ఒక‌నాడు ఆధిప‌త్య కులాల‌పై బాణం ఎక్కు పెట్టింది. తుపాకీ ప‌ట్టింది. నక్స‌లైట్ గా మారింది. ఆమె అస‌లు పేరు ధ‌న‌స‌రి అన‌సూయ‌. మారుతున్న క్ర‌మంలో ఏకంగా ఎమ్మెల్యేగా గెలుపొందింది. ఇవాళ కాంగ్రెస్(Congress) పార్టీలో కీల‌క‌మైన, విస్మ‌రించ లేని నాయ‌కురాలిగా ఎదిగింది. ఎవ‌రు ఎన్ని ర‌కాలుగా ఆరోప‌ణ‌లు గుప్పించినా ప్ర‌జ‌ల కోసం ప‌ని చేస్తున్న నాయ‌కుల‌లో ఆనాడు గుమ్మ‌డి న‌ర్స‌య్య త‌ర్వాత ఇవాళ సీత‌క్క‌నే క‌నిపిస్తోంది. 52 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న సీత‌క్క‌కు ప్ర‌జ‌లంటే ముఖ్యంగా ఆదివాసీ బిడ్డ‌లంటే పంచ ప్రాణం. ఆమె గ‌తం అత్యంత బాధాక‌రం. కానీ త‌ను ఓడించిన ప్ర‌జ‌లే త‌న‌కు ఎమ్మెల్యేగా ప‌ట్టం క‌ట్టేంత వ‌ర‌కు త‌న‌ను తాను నాయ‌కురాలిగా ప్రూవ్ చేసుకున్నారు సీత‌క్క‌.

15 ఏళ్ల‌కు పైగా న‌క్స‌లైట్ ఉద్య‌మంలో అజ్ఞాత వాసం గ‌డిపిన సీత‌క్క‌కు ఎలా ప‌ని చేయాలో , చేయించు కోవాలో బాగా తెలుసు. మొత్తంగా రేవంత్ రెడ్డి చేసిన ఈ ఒక్క కామెంట్ సీత‌క్క‌ను టార్చ్ బేర‌ర్ గా మార్చేలా చేసింద‌నడంలో సందేహం లేదు. రాబోయే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ వ‌ర్సెస్ బీఆర్ఎస్ కాబోతోంద‌న్న ప్ర‌చారం జోరందుకుంది. ఒక‌వేళ ప‌వ‌ర్ లోకి వ‌స్తే రేవంత్ రెడ్డి, భ‌ట్టి విక్ర‌మార్క‌తో పాటు సీత‌క్క కూడా సీఎం రేసులో నిల‌వ‌డం మాత్రం ఖాయం. మ‌రి పాలిటిక్స్ లో ఏదైనా జ‌ర‌గ వ‌చ్చు..ఏమో గుర్రం ఎగురా వ‌చ్చు అన్న‌ట్టు సీత‌క్క సీఎం అవుతుందా అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. వేచి చూడడ‌మే మిగిలింది ఇక‌.

Also Read : YS Sharmila : కాళేశ్వ‌రం తెలంగాణ‌కు శాపం

Leave A Reply

Your Email Id will not be published!