CM MK Stalin: నియోజకవర్గాల పునర్విభజనపై చర్చకు సీఎం స్టాలిన్ లేఖ
నియోజకవర్గాల పునర్విభజనపై చర్చకు సీఎం స్టాలిన్ లేఖ
CM MK Stalin : లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి తమిళనాడు సీఎం స్టాలిన్ సిద్ధమౌతున్నారు. దీనిలో భాగంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో కలిగే నష్టాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్యలు చేపట్టేందుకు కలిసి రావాలని పలువురు ముఖ్యమంత్రులు, 7 రాష్ట్రాల్లోని 29 పార్టీల అధ్యక్షులకు సీఎం స్టాలిన్(CM MK Stalin) లేఖలు రాశారు. ఈ అంశంపై ఈ నెల 22న చెన్నైలో నిర్వహించబోయే సమావేశానికి తమ పార్టీలు లేదా ప్రభుత్వాల నుండి ప్రతినిధులను పంపాలని కోరారు. పెరిగిన జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే… జన సంఖ్య నియంత్రించిన రాష్ట్రాలకు లోక్సభలో తక్కువ ప్రాతినిధ్యం దక్కుతుందన్నారు. ఇది సభలో ఆయా రాష్ట్రాల గళాన్ని వినిపించే సామర్థ్యాన్ని తగ్గిస్తుందని లేఖలో పేర్కొన్నారు. దీనిపై పోరాడేందుకు రాష్ట్రాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ అంశంపై చర్చించేందుకు ఏర్పాటు చేయబోయే ఉమ్మడి కార్యాచరణ కమిటీ(జేఏసీ)లో చేరి, సమన్వయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి తమ ప్రతినిధులను నియమించాలని కోరారు.
CM MK Stalin Letter
ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ(పశ్చిమ బెంగాల్), రేవంత్ రెడ్డి(తెలంగాణ), చంద్రబాబు (ఆంధ్రప్రదేశ్), పినరయి విజయన్ (కేరళ), సిద్ధరామయ్య (కర్ణాటక), భగవంత్ మాన్ (పంజాబ్) తోపాటు మాజీ సీఎంలు కేసీఆర్ (తెలంగాణ), జగన్ మోహన్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్), నవీన్ పట్నాయక్ (ఒడిశా)లకు లేఖలు పంపారు. వీరితోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, పంజాబ్లలో లోక్ సభలో ప్రాతినిధ్యం ఉన్న పార్టీల అధ్యక్షులకూ స్టాలిన్(CM MK Stalin) లేఖలు పంపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించబోయే నియోజకవర్గాల పునర్విభజన ఫెడరల్ రాజ్యాంగ విధానానికి వ్యతిరేకమైందని, ఈ వ్యవహారాన్ని రాజకీయపరంగా, చట్టపరంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. 2021లో జరగాల్సిన జనగణన ఆలస్యం కావడంతో నియోజకవర్గాల పునర్విభజన… 2031లో జరగనున్న జన గణన ప్రకారం జరుగుతుందని భావించామని, అయితే అంతకంటే ముందే పునర్విభజన చేపట్టనుండడంతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లడం ఖాయమని ఈ లేఖలో పేర్కొన్నారు. కుటుంబ నియంత్రణ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి, జనాభా పెరుగుదలను నియంత్రించిన రాష్ట్రాలకు తీరని నష్టం కలుగుతుందన్నారు. పునర్విభజనకు తాము వ్యతిరేకం కాదని, అయితే అప్రజాస్వామికంగా చేపడుతున్న పునర్విభజననే వ్యతిరేకిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ‘‘జనాభా నియంత్రణను సమర్థవంతంగా పాటించినందుకు మనకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చోకూడదు’’ అని స్టాలిన్ వ్యాఖ్యానించారు.
Also Read : Nara Lokesh: ఆరోగ్యం జాగ్రత్త అంటూ మంత్రి నిమ్మలకు నారా లోకేశ్ స్వీట్ వార్నింగ్
