YS Jagan: పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలు రద్దు చేయాలి – వైఎస్ జగన్
పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలు రద్దు చేయాలి - వైఎస్ జగన్
YS Jagan : ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ నిర్వహించిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు వెంటనే రద్దు చేసి, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్దంగా తిరిగి నిర్వహించాలని వైసీపీ (YCP) అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో అధికారపక్షం అంతులేని దౌర్జన్యకాండ చేసిందని… వారికి పోలీసులు పూర్తిగా సహకరించారని ఆయన ఆరోపించారు. సాక్షాత్తూ కలెక్టర్ సమక్షంలో దొంగ ఓట్లు వేయడం, పోలీసులే దగ్గరుండి రిగ్గింగ్ జరిపించడాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనిపించడం లేదని… అందుకు మంగళవార జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పోలింగ్ బూత్ ల్లో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఏజెంట్స్ లేకుండా ఎన్నికలు నిర్వహించారన్నారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో 15 పోలింగ్ బూత్‌లు ఉండగా, వాటిలో మా పార్టీ ఏజెంట్లను అస్సలు ఉండనివ్వలేదు. ఏ ఒక్క ఏజెంట్‌ను బూత్ దగ్గరకు కూడా పోనీయకుండా ఆపేసి ఎన్నికల రిగ్గింగ్ చేశారు. పోలీసుల ప్రోద్భలంతో, పోలింగ్ బూత్ ల్లోకి ఏజెంట్లను పోనివ్వలేదు. ఇంత దారుణ ప్రజాస్వామ్యం దేశంలో ఎక్కడా ఉందా అని ప్రశ్నించారు.
YS Jagan – చంద్రబాబుకు జగన్ సవాల్
చంద్రబాబుకు తమ పరిపాలన మీద విశ్వాసం ఉంటే, తాను ప్రజలకు మంచి చేశారని నమ్మితే, వారు మీకు ఓటు వేస్తారనుకుంటే, వెంటనే నిన్నటి ఎన్నికలు రద్దు చేయండి. కేంద్ర బలగాలు దింపి, వారి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించండి. మీకు ఆ నమ్మకం లేదు కాబట్టే, మీరు ప్రజలను మోసం చేశారు కాబట్టే, ప్రజలు ఓటు వేయరు కాబట్టే, విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ప్రతి బూత్ కు సంబంధించిన వెబ్‌కాస్టింగ్ వైసీపీ (YCP) అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం ఉందా? పోలింగ్ బూత్ ఆవరణల్లో సీసీ ఫుటేజ్ బయట పెడతారా? ఆ ధైర్యం ఉందా?. మీకు ఆ ధైర్యం లేదు. అయినా ఎవరెవరు బయటి నుంచి వచ్చి, పోలింగ్‌బూత్‌లు ఆక్రమించి దొంగ ఓట్లు వేశారనేది చూపుతాం అంటూ సవాల్ చేసారు.
YS Jagan – ప్రతి ఓటరుకు ఒక రౌడీ – జగన్
పులివెందుల జడ్పీటీసీ కింద ఆరు పంచాయితీలు, 15 పోలింగ్ కేంద్రాలు ఉంటే, ఆ ఆరు పంచాయితీల్లో భద్రత పేరుతో 700 మంది పోలీసులను పెట్టారు. అది ప్రజల భద్రత కోసం కాదు. కేవలం వారిని భయపెట్టడం కోసమే అంత మంది పోలీసులు. ఉదయం 4 గంటలకల్లా ఇతర ఊళ్ల నుంచి వచ్చిన వారు ఆయా గ్రామాల్లో మకాం వేశారు. టీడీపీ (TDP) నాయకులు, కార్యకర్తలు ఒక్కో బూత్ కు దాదాపు 400 మంది పాగా వేశారు. పోలీసుల సమక్షంలనే అంతా జరిగింది. వారే ప్రోత్సహించారు. పచ్చ చొక్కా లు వేసుకున్న పోలీసులు, బయట నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులు అంతా కలిపి మొత్తం 7 వేల మంది ఉంటారు. అంటే ఒక్కో ఓటరుకు బయట నుంచి ఒక్కో రౌడీని ఏర్పాటు చేశారు.
టీడీపీ (TDP) మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో అరాచకం సృష్టించేందుకు ఈ గ్రామాలను పంచుకున్నారు. మంత్రి సవిత ఎర్రబల్లెలో తిష్ట వేస్తే… ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగు నుంచి భారీగా తన అనుచరులతో నల్లపురెడ్డిపల్లెలో మకాం వేశాడు. మరో టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య ఇ.కొత్తపల్లిలో వందల మంది కార్యకర్తలతో అక్కడే మకాం వేస్తే.. బీటెక్ రవి అనే టీడీపీ నాయకుడు తనది పులివెందుల రూరల్ ఓటరు కాకపోయినా కనంపల్లిలో తిష్ట వేసి దౌర్జన్యం చేశాడు.
పోలింగ్ బూత్‌లకు వైసీపీ ఏజెంట్లు పోతే, వారిపై దాడి చేసి, ఫామ్ లు లాక్కుని చింపేశారు. ఇంకా ఓటర్ల స్లిప్‌లు కూడా లాక్కుని వారిని వెనక్కి పంపి, వారే ఓటు వేసుకున్నారు. అలా వైసీపీ ఏజెంట్లు లేకుండానే పోలింగ్ జరిగింది. ఎవరైనా బూత్‌వైపు వస్తే, వచ్చింది వైసీపీ సానుభూతిపరుడైనా, లేక తటస్థుడైనా… టీడీపీ వారు బెదిరించి ఓటరు స్లిప్ లాక్కుని దౌర్జన్యంగా బయటకు పంపించారు.
రాహుల్ తో జత కట్టాల్సిన అవసరం లేదు – జగన్
గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత, ఎన్నికలు జరిగిన తీరుపై మాకున్న అభ్యంతరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుంచాం. మాకు జరిగిన అన్యాయాలను సవివరంగా చెప్పాం. నిజానికి దేశంలోనే అత్యంత అన్యాయం ఎక్కడన్నా జరిగిందంటే అది మన రాష్ట్రంలోనే. పోలింగ్ ముగిసిన తర్వాత కౌంటింగ్ నాటికి ఓట్లు భారీగా పెరిగాయి. ఏకంగా 12.5 శాతం. అంటే దాదాపు 48 లక్షల ఓట్లు. ఆ స్థాయిలో ఓట్లలో తేడా వస్తే, ఎన్నికల సంఘానికి మావాళ్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు. అందరినీ కలిసి చెప్పారు.
వారు స్టేట్ ఇంటెన్సివ్ రివిజన్ ఎక్సర్ సైజ్ ఆంధ్రరాష్ట్రంలో కూడా చేస్తామని సానుకూలంగా మాట్లాడారు. కానీ ఏం జరిగింది ?. ఎండాఫ్ ద డే. ఏం చేయగలిగారు ?. ఏదైనా కానీ, ఈ రాహుల్‌గాంధీ ఇప్పుడు ఏదైతే చెబుతున్నారో.. మరి ఆయన ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడటం లేదు?. నిజానికి ఇక్కడే అత్యధికంగా ఓట్లలో అక్రమాలు జరిగాయి. అయినా ఆయన మాట్లాడరు. ఎందుకంటే ఆయన చంద్రబాబుతో హాట్లైన్లో టచ్‌లో ఉన్నారు కాబట్టి మాట్లాడటం లేదు.
