Minister Nara Lokesh: పలువురు కేంద్ర మంత్రులతో ఏపీ మంత్రి నారా లోకేశ్‌ భేటీ

పలువురు కేంద్ర మంత్రులతో ఏపీ మంత్రి నారా లోకేశ్‌ భేటీ

Nara Lokesh : హస్తిన పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేశ్‌… సోమవారం పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. జైశంకర్‌, జేపీ నడ్డా, హర్దీప్‌సింగ్‌ పురీ, నితిన్‌ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌, సర్బానంద సోనోవాల్‌, అశ్వినీ వైష్ణవ్‌ తో వేరువేరుగా లోకేశ్‌ (Nara Lokesh) సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ లో డేటా సిటీ ఏర్పాటుకు సహకారం అందించాలని జైశంకర్‌ ను కోరారు. ఇటీవల ఏపీ బృందం సింగపూర్‌ పర్యటన వివరాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం సింగపూర్‌ ప్రభుత్వంతో జరిపిన చర్చల గురించి కేంద్ర మంత్రికి నారా లోకేశ్‌ వివరించారు. జేపీ నడ్డాతో సమావేశమైన రాష్ట్రంలో యూరియా సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 21 నాటికి సమస్యను పరిష్కరిస్తామని ఆయనకు నడ్డా హామీ ఇచ్చినట్లు సమాచారం.

Minister Nara Lokesh Meeting

కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీని కూడా మంత్రి లోకేశ్‌ (Nara Lokesh) కలిశారు. బీపీసీఎల్‌ రిఫైనరీ త్వరితగతిన నిర్మించేందుకు సహాకారం అందించాలని కోరారు. ఓఎన్‌జీసీకి చెందిన జాక్‌ ఆఫ్‌ రిగ్‌ కాంట్రాక్టు సాధనకు సహకరించాలని కోరారు. ఏపీలో దీపం-2 పథకానికి మరింత సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్‌గడ్కరీతో లోకేశ్‌ సమావేశమై కానూరు-మచిలీపట్నం రోడ్డు విస్తరణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కానూరు-మచిలీపట్నం మధ్య ఆరు లైన్ల రోడ్డు విస్తరణకు వెంటనే ఉత్తర్వులు జారీచేయాలని లోకేశ్‌ కోరారు.

అనంతరం ఆయన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను (Nirmala Sitharaman) ఆయన కలిశారు. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్‌… ఆర్థిక ఇబ్బందుల నుంచి రాష్ట్రం గట్టెక్కేందుకు సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. క్వాంట్‌ వ్యాలీ, ఆర్‌టీఐహెచ్‌లకు ఆర్థికసాయం అందించాలని రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. దుగరాజపట్నం పోర్టుతోపాటు షిప్ బిల్డింగ్ యూనిట్‌ను అభివృద్ధి చేయాలని సర్బానందను మంత్రి లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు. అడ్వాన్స్ డ్ టెక్నాలజీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, క్వాంటమ్ ఆవిష్కరణలు, విధానపరమైన సంస్కరణల్లో ముందున్న ఆంధ్రప్రదేశ్ కు సహకారం అందించాలని కేంద్రానికి విజ్జప్తిచేశారు. రాష్ట్రానికి ఇటీవల సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేయడంపై కేంద్ర రైల్వే, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్వనీ వైష్టవ్ కు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ హబ్ గా అభివృద్ధి చెందుతుందని అన్నారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఐటి పెట్టుబడులను ప్రోత్సహించడం వల్ల వలసలను తగ్గించి, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి అవకాశం ఏర్పడుతుంది. టైర్ -3 నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఐటి పరిశ్రమ విస్తరించేలా ఆదాయపన్ను మినహాయింపులు ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం అత్యవసరంగా పర్మినెంట్ ఎస్టాబ్లిష్ మెంట్ రూల్స్ లో సవరణలు చేపట్టండి. విదేశీ క్లౌడ్ సర్వీసు ప్రొవైడర్లు భారత్ లో పెట్టుబడి పెట్టడానికి, ప్రపంచ పోటీతత్వాన్ని మెరుగుపర్చడానికి ఇది అనివార్యం. ఆంధ్రప్రదేశ్ లో ఐపిని కాపాడుతూ పరివర్తనాత్మక ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు వీలుగా ఎఐ శిక్షణ, టెక్స్ట్ అండ్ డాటా మైనింగ్ (TDM) మినహాయింపుల కోసం సెక్షన్ – 52కి కాపీరైట్ చట్టసవరణ చేపట్టాలి.

Nara Lokesh – ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌తో ఏపీ మంత్రి నారా లోకేశ్‌ భేటీ అయ్యారు. దిల్లీ పర్యటనలో ఉన్న లోకేశ్‌… కేంద్రమంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, టీడీపీ ఎంపీలతో కలిసి ఆయన్ను కలిశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైనందుకు రాధాకృష్ణన్‌కు లోకేశ్‌ అభినందనలు తెలిపారు. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలకు గవర్నర్‌ గా పనిచేసిన అనుభవం రాబోయే రోజుల్లో దేశానికి సమర్థవంతమైన సేవలు అందించడానికి ఉపకరిస్తోందని పేర్కొన్నారు. క్రమశిక్షణ, పట్టుదలకు మారుపేరైన రాధాకృష్ణన్ తమలాంటి కొత్తతరానికి ఆదర్శంగా నిలుస్తారని ప్రశంసలు కురిపించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడుతో తన పరిచయాన్ని లోకేశ్‌తో సీపీ రాధాకృష్ణన్ పంచుకున్నారు.

Also Read : Hyderabad: దేశంలోనే రెండో అత్యంత ఖరీదైన నగరంగా హైదరాబాద్‌

Leave A Reply

Your Email Id will not be published!