సాగ‌ర‌మాల‌ ద్వారా హార్బర్ల ఆధునీకరణ : అచ్చెన్నాయుడు

ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధిపై కూట‌మి ప్రభుత్వం దృష్టి

అమ‌రావ‌తి : ప్ర‌ధానమంత్రి మ‌త్స్య సంప‌ద యోజ‌న‌, సాగరమాల వంటి కేంద్ర పథకాల సహకారంతో రాష్ట్రంలోని ఫిషింగ్ హార్బర్లను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరిస్తున్నామని వ్యవసాయ, మ‌త్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పెందుర్తి శాసన సభ్యులు పంచకర్ల రమేష్ బాబు పరవాడ మండలంలోని ముత్యాలమ్మపాలెం గ్రామంలో మినీ జెట్టి / ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో కోస్తా ప్రాంత అభివృద్ధి, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల స్థితిగతులు, ముత్యాలమ్మ పాలెం ప్రాజెక్ట్ పురోగతి గురించి స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. దీనికి స‌మాధానం ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు కింజార‌పు అచ్చెన్నాయుడు.

రాష్ట్రానికి 12 కోస్తా జిల్లాల్లో కలిపి 1053.07 కి.మీ తీరప్రాంతం ఉండగా 350 ల్యాండింగ్ సెంటర్లు, ఫిషింగ్ హార్బర్లు గుర్తించడం జ‌రిగింద‌న్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. 2020 సంవ‌త్స‌రం జులై 15 నుంచి ఫిషింగ్ హార్బర్లు మత్స్యశాఖ నుంచి పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖకు బదిలీ అయ్యాయని పేర్కొన్నారు. తొలి దశలో జువ్వలదిన్నె, ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం హార్బర్లు నిర్మాణంలో ఉండగా, రెండో దశలో బుడగట్ల పాలెం, పూడిమడక, కొత్తపట్నం, వోడరేవు హార్బర్లు ప్రతిపాదనలో ఉన్నాయని తెలిపారు. PMMSY, సాగరమాల, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ సహకారంతో విశాఖ హార్బర్ ఆధునీకరణ పనులు రూ.178.51 కోట్లతో కొనసాగుతున్నాయని చెప్పారు.

అంతే కాకుండా కాకినాడ హార్బర్ ఆధునీకరణకు రూ.58.95 కోట్లతో DPR సిద్ధం చేయడానికి CICEF అంగీకరించిందని వివరించారు. అలాగే ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల విషయంలో అంతర్వేది పల్లిపాలెం, గుండయ పాలెంలో జెట్టీ సౌకర్యాలతో కార్యకలాపాలు సాగుతున్నాయని, భావనపాడు FLCకు నది ముఖద్వారం స్థిరీకరణ కోసం అవసరమైన సాంకేతిక చర్యలను APMBకు తెలియజేశామని చెప్పారు. PMMSY కింద రూ.126.91 కోట్లతో దొండువాక, ఉప్పలంక, భీమిలి, రాజయ్యపేట, చింతపల్లి, రాయదరువులో FLCల అభివృద్ధి టెండరింగ్ దశలో ఉందన్నారు. మచిలీపట్నం, బియ్యపుతిప్ప FLC పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!