అమరావతి : రాష్ట్రంలో వైసీపీ ఉన్మాద రాజకీయాలు రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతున్నాయని, ప్రజాస్వామ్య వ్యవస్థలపై నేరుగా దాడి జరుగుతోందని మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదం కంటే భయంకరమైన పరిస్థితులను రాష్ట్రంలో సృష్టించారని, ఇది సమాజ భవిష్యత్తుకు ముప్పుగా మారిందని ఆయన పేర్కొన్నారు. మంగళవవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిందని విమర్శించారు. ప్రతిపక్షాలపై దాడులు చేయడమే వైసీపీ లక్ష్యంగా మారిందని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. అలాంటి పరిస్థితుల మధ్య తోట చంద్రయ్య అమానుష హత్య దారుణమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక సామాన్య కార్యకర్తపై ఇలాంటి దాడి జరగడం కేవలం వ్యక్తిగత ఘటన కాదని, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఈ ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రయ్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని, తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని, సామాన్య ప్రజలు భయాందోళనలో జీవిస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని మహిళలు, రాజకీయ ప్రత్యర్థుల కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెడుతున్న తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. ఇలాంటి పైశాచిక చర్యలు సమాజాన్ని కలుషితం చేస్తున్నాయని హెచ్చరించారు. అధికార మదంతో వైసీపీ నేతలు సామాన్యులను వేధించడం, ప్రజల ఆస్తులను కబ్జా చేయడం వంటి ఘటనలు పెరిగాయని అన్నారు.
గత ప్రభుత్వం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని, అభివృద్ధి కంటే విధ్వంసానికే ప్రాధాన్యం ఇచ్చిందని విమర్శించారు. పోలీసు వ్యవస్థను రాజకీయ అవసరాలకు వినియోగిస్తూ, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టారని, భౌతిక దాడులకు కూడా దిగారని ఆరోపించారు. ఈ విధంగా రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతిభద్రతలను పునరుద్ధరించడం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. చట్టాన్ని అతిక్రమించే వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని, నేరస్తులకు కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. వైసీపీ అరాచకాలపై ప్రజలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇలాంటి వికృత రాజకీయాలను తిరస్కరించాలని మంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి, శాంతి కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన కోరారు.
