మహిళా రిజర్వేషన్ నారీ శక్తి వందన్ కు మద్దతివ్వండి
అన్ని పార్టీల అధ్యక్షులకు సీఎం చంద్రబాబు లేఖ
అమరావతి : మహిళా రిజర్వేషన్ ‘నారీ శక్తి వందన్’కు పార్లమెంట్‌లో మద్దతుపై రాజకీయ పార్టీల అధ్యక్షులకు, రాష్ట్రంలోని రాజ్యసభ, లోక్ సభ ఎంపీలకు మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. 2029 ఎన్నికల నుంచే మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు చేసేలా తీసుకు వస్తున్న చట్ట సవరణ బిల్లుకు మద్దతు పలకాలని కోరారు. జనసేన అధ్యక్షులు కె పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాస రావుకు ముఖ్యమంత్రి లేఖలు రాశారు.
మహిళలకు పార్లమెంట్, విధాన సభల్లో మూడో వంతు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పాన్ని బలపరుద్దామని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు ప్రవేశపెట్టే ఈ నెల 16వ తేదీ భారత ప్రజాస్వామ్యంలో చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు సీఎం. మహిళా సాధికారతతో పాటు దేశ ఉన్నతికి దోహదప డుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంలో, పరిపాలనలో, చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. భరతమాతను పూజించే దేశంగా నారీ శక్తికి వందనం పలుకుదాం అని పిలుపునిచ్చారు.
మహిళా రిజర్వేషన్ అమలుకు బాటలువేసే ‘నారీ శక్తి వందన్ అధినియం’ సవరణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల ముందుకు రానుండటంతో దశాబ్దాల కల నిజం అవుతోందని పేర్కొన్నారు సీఎం. భారత ప్రజాస్వామ్యంలో శాశ్వతంగా నిలిచేలా, సమానత్వం సాధించేందుకు ఇది గొప్ప ముందడుగుగా అభివర్ణించారు నారా చంద్రబాబు నాయుడు.
