అమరావతి : ఈ నెల 16, 17, 18 తేదీల్లో పార్లమెంట్ లో మహిళా బిల్లు ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో ఢిల్లీకి బయలు దేరనున్నారు. మంత్రి సవితతో పాటు మహిళా మంత్రులు వంగలపూడి అనిత, సంధ్యరాణి సహా పలువురు మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిదగిన విషయం మహిళా బిల్లు ఆమోదమన్నారు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిథ్యం కల్పించడం ద్వారా భారత ప్రజాస్వామ్యం మరింత ధృడంగా మారుతుందన్నారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రధాని నరేంద్ర మోడి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ఆమె ఆనందం వ్యక్తంచేశారు.
మహిళల అభివృద్దితోనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని ఎస్ . సవిత అభిప్రాయపడ్డారు. మహిళా బిల్లుతో రాజకీయాల్లో మహిళల పాత్ర పెరిగి, సాధికారతకు బలమైన పునాది పడుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడికి, కేంద్ర ప్రభుత్వానికి మంత్రి సవిత ధన్యవాదాలు తెలియజేశారు. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ బిల్లు ప్రవేశం సందర్భంగా జరిగే చర్చను వీక్షించనున్నట్లు వెల్లడించారు. అనంతరం ఈ నెల 18న ప్రధానమంత్రి నరేంద్ర మోడిని, ఇతర కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి ధన్యవాదాలు తెలియ జేయనున్నట్లు తెలిపారు. మహిళా బిల్లుకు ఏపీలోని సీఎ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తి మద్దతు తెలియ జేస్తున్నట్లు ప్రకటించారు.
