ఏపీలో సింగపూర్ తరహా గ్లోబల్ మైస్ ఏర్పాటు చేస్తాం
జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ మీటింగ్ లో లోకేష్
సింగపూర్ : సింగపూర్ పర్యటనలో బిజీగా ఉన్నారు ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. సింగపూర్‌లోని పుంగోల్ జిల్లా తరహాలో అమరావతిలో నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్… ఏపీలోని ఇతర పట్టణ ప్రాంతాలకు మాత్రమే కాకుండా, భారతదేశంలోనే ఒక మోడల్ టౌన్ షిప్ గా నిలుస్తుందని నారా లోకేష్ పేర్కొన్నారు. ఇందు కోసం ప్రపంచ బ్యాంకు నుండి అవసరమైన మద్దతు తీసుకోవడంతో పాటు విధి విధానాలను ఖరారును వేగవంతంగా చేయాల్సిందిగా జాయింట్ ఇంప్లిమెంటేషన్ వర్కింగ్ కమిటీని కోరారు. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం… సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ (JISC) ప్రతినిధులతో సింగపూర్ లో సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడారు. మీ మద్దతుతో అమరావతి ఆర్థిక ప్రాంతాన్ని అత్యుత్తమంగా అభివృద్ధి చేయాలని తాము కోరుకుంటున్నాం అని అన్నారు.
అమరావతి ఎకనమిక్ రీజియన్ అభివృద్ధిలో ఆసక్తిగల భాగస్వాములను ఆహ్వానిస్తూ ఆర్ఎఫ్‌పీ పై ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశాం అన్నారు. అమరావతి రాజధానికి ఇప్పుడు జాతీయ చట్టబద్ధత ఉందని తెలిపారు. దీనివల్ల ఈ ప్రాంతంలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచుతుందని అన్నారు నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ నుంచి… సింగపూర్ ద్వారా ఆగ్నేయాసియా, తూర్పు ఆసియాల మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని కోరారు. సింగపూర్ తరహాలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక గ్లోబల్ MICE గమ్యస్థానంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అలాంటిది ఏర్పాటు చేసేందుకు సింగపూర్ సన్‌టెక్ సిటీని అధ్యయనం చేస్తాం అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో రియల్ టైమ్ గవర్నెన్స్ ను బలోపేతం చేయడానికి సింగపూర్ అనుభవాన్ని ఇక ముందు కూడా ఉపయోగించుకుంటాం అని చెప్పారు.