హైదరాబాద్ : అంతర్జాతీయ పరంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో సోమవారం అనూహ్యంగా స్టాక్ మార్కెట్లు పతనం చెందాయి. దీంతో రూపాయి మారకం విలువ మరింత క్షీణించింది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ చారిత్రక కనిష్ట స్థాయికి పడిపోయింది. దాదాపు ₹95.40 స్థాయికి క్షీణించింది. అంతర్జాతీయ ఒడుదొడుకులు, క్రూడ్ ఆయిల్ ధరల పెంపు , విదేశీ పెట్టుబడిదారుల ఉపసంహరణ కారణంగా రూపాయిపై తీవ్ర ఒత్తిడి నెలకొంది.
ట్రేడింగ్ ప్రారంభంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్ 1000 పాయింట్ల మేర కుంగింది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 800 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 200 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ కరోనా కాలం నాటి చర్యలను ప్రస్తావించడం, యుద్ధం ముగింపు విషయంలో ఇరాన్ శాంతి ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు తిరస్కరించడంతో మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. చమురు ధరలు భగ్గుమనడంతో మన సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. నిఫ్టీ సూచీలో టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, మ్యాక్స్ హెల్త్‌కేర్, ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అటు టైటాన్ కంపెనీ, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఎస్‌బీఐ, ఎటర్నల్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి.
భారత కరెన్సీ రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో ఊహించని రీతిలో పడిపోయింది. ఇవాళ ట్రేడింగ్ ప్రారంభం కావడమే భారీ నష్టాలతో మొదలైంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి ఏకంగా 145 పైసలు పడిపోయి, 94 రూపాయల 96 పైసల వద్ద ఆల్‌టైమ్ కనిష్ట స్థాయిని తాకింది. గత కొన్ని రోజులుగా పశ్చిమాసియాలో, ముఖ్యంగా హర్మూజ్ జలసంధి వద్ద నెలకొన్న ఉద్రిక్తతలు రూపాయిని కోలుకోలేని దెబ్బ తీశాయి. ఇరాన్- అమెరికా మధ్య పెరుగుతున్న యుద్ధ వాతావరణం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. దీని ప్రభావం నేరుగా కరెన్సీ మార్కెట్‌పై కనిపిస్తోంది.