మంగళగిరి: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు ఐటీ, విద్యా శాఖ మంత్రి, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్. ఆయన మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. పల్నాడు జిల్లాకు అత్యంత ముఖ్యమైన వరికపూడిశెల ఎత్తిపోతల ప్రాజెక్ట్ నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వరికపూడిశెల జలసాధన స మితి ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. బుద్ధ యోగా ఫౌండేషన్ ద్వారా మోస పోయిన 1056 మంది యోగా ఇన్ స్ట్రక్టర్స్ కు తగిన న్యాయం చేయాలని బాధితులు మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు. గత మూడేళ్లుగా తాము చేసిన సేవలను గుర్తించి తగిన న్యాయం చేయడంతో పాటు భవిష్యత్ లో కూడా ఈ సేవలు ప్రభుత్వ పర్యవేక్షణలో కొనసాగించేలా చొరవ చూపాలని అభ్యర్థించారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో జరిగిన గోల్డ్ లోన్ అవతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని బాధితులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. తాము కుదవ పెట్టిన బంగారం వస్తువుతో పాటు తూకంలో తేడాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడిన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో పేద గర్భిణీల ఆరోగ్య సంరక్షణకు నగదు బదిలీ పథకం ప్రవేశపెట్టడంతో పాటు మహిళల ఆత్మరక్షణకు ప్రతి నియోజకవర్గంలో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఏపీ ఎమ్మార్పీఎస్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కోరారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం వెంకటాద్రిపాలెం పంచాయతీ సమగ్ర అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. గ్రామంలో రోడ్ల నిర్మాణంతో పాటు గండివాగుపై బ్రిడ్జి నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
