చెన్నై : తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ కీలక ప్రకటన చేశారు. తాను ఉన్నంత వరకు రాష్ట్రంలో డ్రగ్స్ కు చోటు ఉండదని అన్నారు. శుక్రవారం వేలాది మందితో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా భారీ ఎత్తున మారథాన్‌ను నిర్వహించారు. దీనిని సీఎం ప్రారంభించారు. చిన్నారులు, విద్యార్థులు, స్థానికులు, నగర వాసులతో కలిసి విజయ్ ఉత్సాహంగా ఆరు కిలోమీటర్లు పరుగులు తీశారు.
ఇదిలా ఉండగా గతంలో ముఖ్యమంత్రులు యోగా, నడక, జాగింగ్ లేదా జిమ్ వంటి వ్యాయామాల ద్వారా తమ ఫిట్నెస్ను కాపాడు కోవడం చూశాం, కానీ ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి విద్యార్థులు ,యువతతో కలిసి మారథాన్‌లో పాల్గొని పూర్తి దూరం పరుగెత్తడం ఇదే మొదటిసారి కావడం విశేషం. క్రీడా దుస్తులు ధరించిన 52 ఏళ్ల విజయ్, చెన్నైలోని మెరీనా బీచ్‌లో 6 కిలోమీటర్ల పరుగును ఎక్కడా ఆగకుండా పూర్తి చేశారు.
సామాజిక ప్రయోజనం కోసం ప్రజలతో కలిసి ఇంత దూరం పరుగెత్తిన తమిళనాడు తొలి సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర సృష్టించారు. కేవలం కార్యక్రమాన్ని ప్రారంభించడం లేదా నామమాత్రపు పరుగులో పాల్గొనడం వంటి సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా, తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ వేలాది మంది పాల్గొన్న మాదకద్రవ్యాల వ్యతిరేక మారథాన్‌లో చురుకుగా కిలోమీటర్లు పరుగులు తీయడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్య పోయేలా చేసింది. అంతకు ముందు, విజయ్ “స్టార్ట్ రన్, స్టాప్ డ్రగ్స్” (పరుగు మొదలుపెట్టండి – మాదకద్రవ్యాలను ఆపండి) అనే అవగాహన మారథాన్‌ను అధికారికంగా ప్రారంభించి, పాల్గొన్నవారితో ప్రతిజ్ఞ చేయించారు.
ఎవరూ ఊహించని విధంగా, ‘తమిళగ వెట్రి కళగం’ వ్యవస్థాపకుడు వేదిక దిగి, ఉత్సాహ భరితమైన పాల్గొనేవారి హర్షధ్వానాల మధ్య పరుగు ప్రారంభించారు. ఈ మారథాన్‌ను తమిళనాడు క్రీడా అభివృద్ధి సంస్థ నిర్వహించింది. ఆయన తీసుకున్న ఈ అపూర్వమైన నిర్ణయం పట్ల మాజీ గవర్నర్ , బీజేపీ నాయకురాలు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి విజయ్ ఈరోజు పెద్ద సంఖ్యలో యువతతో కలిసి మాదకద్రవ్య వ్యతిరేక మారథాన్‌లో పాల్గొనడం హృదయ పూర్వకంగా , ప్రశంసనీయంగా ఉందన్నారు. నాయకులు ప్రజలతో కలిసి నడిచినప్పుడు, పరుగెత్తినప్పుడు , నిలబడినప్పుడు, అవగాహన ప్రతి ఇంటికి చేరుతుందని అన్నారు.
మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం రాజకీయాలకు అతీతమైనది. మాదకద్రవ్య రహిత తమిళనాడు కోసం మనమందరం కలిసి పనిచేద్దాం అని పిలుపునిచ్చారు.
