పెన్ష‌న్ల పంపిణీలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ దేశానికి ఆద‌ర్శం

డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులకు హోం మంత్రి సన్మానం

అమ‌రావ‌తి : పెన్ష‌న్ల పంపిణీలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం దేశానికి ఆద‌ర్శ ప్రాయంగా నిలిచింద‌ని అన్నారు రాష్ట్ర హొం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి. బుధ‌వారం రాష్ట్ర వ్యాప్తంగా కూట‌మి స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున అర్హులైన వారికి పెన్ష‌న్లు పంపిణీ చేశారు. సీఎం చంద్ర‌బాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా ఇవాళ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాయకరావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా పాయకరావుపేట పట్టణంలోని పాత పెదిరెడ్డి వారి వీధిలో ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, దివ్యాంగులు, ఇతర లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. వర్షం కురుస్తున్నప్పటికీ లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందజేయడంతో పాటు వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం పాయకరావుపేట పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించిన మంత్రి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డుపై మామిడిపళ్లు విక్రయిస్తున్న పైడమ్మతో ఆప్యాయంగా మాట్లాడి ఆమె వద్ద మామిడిపళ్లు కొనుగోలు చేశారు. అలాగే రోడ్డు పక్కన ఉన్న టిఫిన్ సెంటర్ నిర్వాహకురాలిని పలకరించి, అక్కడ స్థానిక నాయకులతో కలిసి గారెలు రుచి చూశారు. తదుపరి పాయకరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో 15వ ఆర్థిక సంఘం నిధుల కింద రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన పబ్లిక్ హెల్త్ యూనిట్ భవనాన్ని హోంమంత్రి ప్రారంభించారు.

అనంతరం నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి అనిత, పీహెచ్‌సీలో సేవలందిస్తున్న వైద్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి డాక్టర్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం వైద్యులు అంకితభావంతో సేవలందిస్తున్నారని కొనియాడారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ప్రాణాలను కాపాడే వైద్యుల సేవలు అమూల్యమైనవని, వారి సేవలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు.

Leave A Reply

Your Email Id will not be published!