ప్రొద్దుటూరు : జగన్మోహన్ రెడ్డి రాయలసీమ బిడ్డ కాదు.. సీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ, జగన్ అధికారంలో ఉండగా కడప జిల్లాకు ఒక్క పరిశ్రమను సీమకు తీసుకు రాకపోగా, ఇక్కడ సంపదనంతా అడ్డగోలుగా దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రొద్దుటూరు సమీపంలోని దొరసానిపల్లిలో నియోజకవర్గ టిడిపి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రాహ్మణి స్టీల్స్ పేరుతో 11 వేల ఎకరాలను రూ.18 వేల చొప్పున, మరో 3వేల ఎకరాలను రూ.25 వేల చొప్పున భూములు తీసుకున్నారని ఆరోపించారు. యువతకు 10 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క ఇటుక కూడా పేర్చకుండా, ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేశారన్నారు. ఓబులాపురం గనుల్లో విచ్చలవిడిగా ఐరన్ ఓర్ తవ్వేసి రెడ్ గోల్డ్ పేరుతో విదేశాలకు తరలించి వేలకోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. అదే అవినీతి సొమ్ముతో సాక్షి పత్రిక, టివిలను కూడా పెట్టారని దుయ్యబట్టారు.
అధికారంలో ఉన్న ఐదేళ్లలో కడపకు జగన్ చేసింది శూన్యం అంటూ ఎద్దేవా చేశారు. చివరకు ఆయన నియోజకవర్గం పులివెందులకు నీళ్లు ఇచ్చింది కూడా చంద్రబాబేనని తెలిపారు. ఈరోజు దాల్మియా భారత్ విస్తరణ పనులకు మేం శంకుస్థాపన చేశాం, వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉండగా లీగల్ నోటీసులు ఇచ్చి అడ్డుకోవడమే గాక మామూళ్ల కోసం వేధించారని అన్నారు. చంద్రబాబు నాయుడు నాలుగోసారి సిఎం అయ్యాక రాయలసీమలో ఇదివరకెన్నడూ లేనివిధంగా అభివృద్ధి జరుగుతోందని చెప్పారు నారా లోకేష్. జెఎస్ డబ్ల్యు స్టీల్ ప్లాంట్ కు ఇటీవల భూమిపూజ చేశారు, అంతకు ముందు ఎస్ఎఇఎల్ రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్ ను ప్రారంభించాం, జిల్లా వ్యాప్తంగా స్మార్ట్ కిచెన్లు ఏర్పాటుచేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. పరిశ్రమలతోపాటు హార్టికల్చర్ ను కూడా ప్రోత్సహిస్తున్నాం. గొడ్డలి పార్టీ ఫ్యాక్షనిజం తెస్తే మేం ఫ్యాక్టరీలు తెచ్చాం, రాయలసీమలో వారు రక్తాన్ని పారిస్తే, మేం ఉద్యోగాల పంట పండిస్తున్నాం.
