డీలిమిటేషన్ బిల్లుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి

కేంద్ర ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేసిన ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే

ఢిల్లీ : ఏఐసీసీ చీఫ్‌, రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిపక్ష నాయ‌కుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే నిప్పులు చెరిగారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీని ఖర్గే కోరారు. వర్షాకాల సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును తిరిగి ప్రవేశ పెట్టేందుకు కేంద్రం యోచిస్తోందన్న వార్తల నేపథ్యంలో, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. సవరించిన ప్రతిపాదనలపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మార్చి, ఏప్రిల్ నెలల్లోనే నియోజకవర్గాల పునర్విభజన తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుకు లేఖలు రాసినట్లు ఖర్గే తన లేఖలో పేర్కొన్నారు.

దురదృష్టవశాత్తు, ఆ అభ్యర్థనలను అంగీకరించలేదు. తదనంతరం, 2026 ఏప్రిల్ 17న లోక్‌సభలో ‘రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, 2026’కు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ లభించలేదు అని ఆయన అన్నారు. రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో సవరించిన (131వ సవరణ) బిల్లు, 2026ను తిరిగి ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన తదితర అంశాలపై ప్రభుత్వం రూపొందించిన సవరించిన ప్రతిపాదనలను చర్చించడానికి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, అలాగే పార్లమెంటులో ప్రవేశపెట్టే ముందు వాటిని క్షుణ్ణంగా పరిశీలించడానికి మాకు తగిన సమయం ఇవ్వాలని నేను మరోసారి మిమ్మల్ని కోరుతున్నాను అని ఖర్గే పేర్కొన్నారు.

మహిళా రిజర్వేషన్ చట్టానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు కొత్త ముసాయిదాను అమలు చేసే క్రమంలో, దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను తగ్గించేందుకు అన్ని రాష్ట్రాల లోక్‌సభ స్థానాల సంఖ్యను 50 శాతం పెంచేలా ప్రభుత్వం వివిధ ప్రతిపాదనలపై కసరత్తు చేస్తోందన్న వార్తలు వచ్చిన కొద్ది రోజులకే కాంగ్రెస్ అధినేత ఈ లేఖ రాశారు. జనాభా ఆధారిత నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ వల్ల లోక్‌సభలో తమ రాజకీయ ప్రాబల్యం తగ్గుతుందన్న దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఈ ముసాయిదాను సిద్ధం చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్ చట్టం అమలును వేగవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ బిల్లును ఆమోదింప జేయాలని మోదీ ప్రభుత్వం భావించింది. అయితే, దీనికి అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించలేక పోవడంతో, ఏప్రిల్ 17న లోక్‌సభలో ఈ బిల్లు ఆమోదం పొందలేక పోయింది.

Leave A Reply

Your Email Id will not be published!