ఆగస్టు 7 నుంచి శ్రీ కోదండ రామస్వామి పవిత్రోత్సవాలు
గోడపత్రికలు, బుక్లెట్లను ఆవిష్కరించిన టీటీడీ ఈవో
తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. ఆగస్టు 7 నుంచి 10 వరకు తిరుపతి లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కోదండ రామస్వామి వారి పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్బంగా గోడ పత్రికలు, బుక్లెట్లను ఆవిష్కరించారు టీటీడీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ముద్దాడ రవిచంద్ర. ఇదిలా ఉండగా శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో నాలుగు రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా పవిత్రోత్సవాలకు సంబంధించి గోడపత్రికలు, బుక్లెట్లను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర గురువారం తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో ఆవిష్కరించారు.
ఆగస్టు 7వ తేదీ సాయంత్రం అంకురార్పణతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఇందులో భాగంగా మేదినీ పూజ, మృత్సం గ్రహణం, అంకురార్పణ వంటి వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి సందర్భాల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం అని పేర్కొన్నారు. అయితే యాత్రికులు లేదా ఆలయ సిబ్బంది ద్వారా తెలియక జరిగే దోషాల నివారణ, ఆలయ పవిత్రతను కాపాడడం కోసం ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు ఈవో ముద్దాడ రవిచంద్ర.
పవిత్రోత్సవాల్లో భాగంగా మొదటి రోజు సాయంత్రం సీతా రామ లక్ష్మణుల బంగారు తిరుచ్చి తిరువీధి ఉత్సవం, భాష్యకార్ల సన్నిధిలో ఇయల్పడి ఆరగింపు, శాత్తుమొర, ఆస్థానం నిర్వహిస్తారన్నారు. అనంతరం యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం జరుగుతాయి. రెండో రోజు ఉదయం 7 గంటల నుంచి 8.30 గంటల వరకు వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. సాయంత్రం పవిత్ర సమర్పణ తదితర విశిష్ట క్రతువులు చేపడతారని పేర్కొన్నారు ఈవో. మూడో రోజు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ఘనంగా ముగియనున్నాయని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం స్నపన తిరుమంజనం, సాయంత్రం తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
గృహస్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చని, పాల్గొనే గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికెతో పాటు చివరి రోజు ఒక పవిత్రం ప్రసాదంగా అందజేస్తామన్నారు. పవిత్రోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ , అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక ప్రసంగాలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. .
