హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరఫున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. ఓటు హక్కు వయస్సు, ఎన్నికల నిబంధనలు వంటి అంశాలను నిర్ణయించే అధికారం భారత ఎన్నికల సంఘం , కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని స్పష్టం చేవారు. ఇటువంటి అంశాలపై ప్రజలను, ముఖ్యంగా యువతను తప్పుదారి పట్టించే విధంగా వ్యాఖ్యలు చేయడం బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న సీఎంకు తగదన్నారు.అవగాహన లేకుండా ఎలా పడితే అలా మాట్లాడితే జనం ముందు మరింత పలచన అవుతారని పేర్కొన్నారు రాంచందర్ రావు.
అదేవిధంగా రాష్ట్రంలోని సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పేద , మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లల చదువుల కోసం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయని ఆవవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆలస్యం కావడంతో విద్యార్థులు తమ విద్యను కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా ఇతర అంశాలపై దృష్టి మళ్లించడం సరైంది కాదన్నారు. విద్యార్థుల సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకుని ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నామని పేర్కొన్నారు.
