చీరాల/బాపట్ల : త్వరలో చేనేత సహకార సంఘాలతో పాటు ఆప్కో ఎన్నికలు కూడా నిర్వహించనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ప్రకటించారు. అర్హులైన నేతన్నలందరికీ నేతన్న సేవలో పథకం కింద రూ.25 వేల ఆర్థిక సాయం అందించనున్నామని వెల్లడించారు. నేతన్నల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. సీఎం చంద్రబాబు పాలన ఎప్పుడూ చేనేతలకు స్వర్ణ యుగమేనన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అనర్హులకు కూడా నేతన్న నేస్తం పేరుతో ఆర్థిక సాయం అందించిందని విమర్శించారు. ప్రజాబంధు ప్రగడ కోటయ్యచేనేత రంగానికి చేసిన సేవలను భావితరాలకు తెలియ చేస్తోందన్నారు. చీరాలలోని పద్మశాలీ కల్యాణ మండపంలో ప్రగడ కోటయ్య రాష్ట్ర స్థాయి జయంతి వేడుకులను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మద్దులూరి మాల కొండయ్య, ఎమ్మెల్సీ పోతుల సునీత, రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, కమిషనర్ రేఖారాణి, బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తో కలిసి మంత్రి సవిత పాల్గొని ప్రసంగించారు.
రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్దికి ప్రజాబంధు ప్రగడ కోటయ్య చేసిన సేవలు మంత్రి సవిత గుర్తు చేశారు. నేతన్నల సమస్యల పరిష్కారానికి ప్రగడ కోటయ్య తుది శ్వాస విడిచేవరకూ పోరాడారన్నారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యునిగా చట్టసభల్లో చేనేతల వాణిని వినిపించారన్నారు. నాలుగు చేనేత సత్యాగ్రహాలను నిర్వహించిన పోరాట యోధుడని కొనియాడారు. ఆనాటి ప్రధాని జవహర్ నెహ్రూతో చీరాల స్పిన్నింగ్ మిల్లుకు శంకుస్థాపన చేయించారన్నారు. ప్రగడ కోటయ్య స్ఫూర్తితో అన్న ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారననారు. ప్రజాబంధు కోటయ్య సేవలను భావి తరాలకు తెలియ జేయాలన్న ఉద్దేశంతో ఆయన జయంతిని సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ రాష్ట్ర పండుగగా నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేశారన్నారు. చీరాలలో ప్రగడ కోటయ్య రాష్ట్రస్థాయి జయంతిని నిర్వహించడం గర్వంగా ఉందన్నారు.
