వైభ‌వోపేతం పుష్పయాగ మహోత్సవం

పరిహారార్థం శాస్త్రోక్తంగా నిర్వహణ

తిరుపతి : అప్పలాయగుంట లోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. జూన్ 25 నుంచి జూలై 3 వరకు నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాల్లో నిత్యకైంకర్యాలు, ఉత్సవాల సందర్భంగా అర్చకులు, అధికారులు, పరిచారకులు, భక్తుల వల్ల తెలియక జరిగిన లోపాల పరిహారార్థం ఆగమశాస్త్ర సంప్రదాయం ప్రకారం ఈ పుష్పయాగాన్ని నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీటితో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం పుష్ప యాగానికి వినియోగించే పుష్పాలను మూలమూర్తి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి, ఆలయ ప్రదక్షిణతో పాటు మాడవీధుల్లో శోభాయాత్రగా తీసుకువచ్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సర్వభూపాల వాహనంలో స్వామివారిని కొలువు దీర్చారు.

మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ సుమారు రెండున్నర టన్నుల పుష్పాలతో పుష్ప యాగం వైభవంగా జరిగింది. తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలతో సహా 18 రకాల పుష్పాలు, ఆరు రకాల పవిత్ర పత్రాలతో స్వామివారికి పుష్పార్చన నిర్వహించారు. ఆధ్యాత్మిక వైభవాన్ని తిలకించిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి పోయారు. అనంతరం వీధి ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌, ఏఈవో దేవరాజులు, ఏవీఎస్వో శ్రీహరి రావు, సూపరింటెండెంట్ శ్రీవాణి, కంకణభట్టార్ సూర్యకుమార్ ఆచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ వేణుగోపాల్, ఇతర అధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!