నల్లమల సాగర్‌కు కృష్ణా జలాల మళ్లింపు : నిమ్మ‌ల

కీల‌క స‌మీక్ష చేప‌ట్టిన నీటి పారుద‌ల శాఖ మంత్రి

అమ‌రావ‌తి : నల్లమల సాగర్‌కు కృష్ణా జలాల మళ్లింపుపై రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు స‌మీక్ష చేప‌ట్టారు. ఆగస్టు మూడవ వారంలో రిజర్వాయర్‌కు నీటిని మళ్లించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని , ‘చెక్ మెమో’ను సమర్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ , ఇతర ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కృష్ణా నదీ జలాలను నల్లమల సాగర్ రిజర్వాయర్‌కు మళ్లించే ఏర్పాట్లు, వెలిగొండ ప్రాజెక్ట్ పురోగతిపై నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్షించారు. ఆగస్టు మూడవ వారంలో రిజర్వాయర్‌కు నీటిని మళ్లించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని స్ప‌ష్టం చేశారు మంత్రి.

కొల్లం వాగు సొరంగాల (టన్నెల్స్) ద్వారా కృష్ణా జలాలను మళ్లించడానికి అవసరమైన ‘అప్రోచ్ ఛానల్’ (నీటిని మళ్లించే మార్గం) పనులు పూర్తయ్యాయని ఈ సంద‌ర్భంగా మంత్రి నిమ్మ‌ల రామానాయుడుకు అధికారులు తెలిపారు. రెండు సొరంగాలలో మిగిలి ఉన్న 286 మీటర్ల లైనింగ్ పనులు 10 రోజుల్లో పూర్తవుతాయని చెప్పారు. అలాగే టన్నెల్-2లో చిక్కుకు పోయిన టన్నెల్ బోరింగ్ మెషీన్ తొలగింపు ప్రక్రియ వారం రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తమ ఐదేళ్ల పాలనలో ఆ టీబీఎంను తొలగించడంలో విఫలమైందని రామానాయుడు విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్ట్ పనులను సమీక్షిస్తూ, ప్రాజెక్ట్ వల్ల ప్రభావితమైన మొత్తం 7,321 కుటుంబాలలో 2,560 కుటుంబాలకు ₹318 కోట్ల పరిహారం చెల్లించినట్లు మంత్రి తెలిపారు. మిగిలిన 1,898 కుటుంబాలక రూ. 210 కోట్ల పరిహారాన్ని ఈ నెలాఖరు నాటికి విడుదల చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Leave A Reply

Your Email Id will not be published!