కావేరీ హక్కులను పరిరక్షించాలి : అన్బుమణి రామదాస్
మేకదాటు కోసం కర్ణాటక చేస్తున్న ప్రయత్నాలు ఆపాలి
చెన్నై : పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ నిప్పులు చెరిగారు. కార్ణాటక రాష్ట్ర సర్కార్ అనుసరిస్తున్న నిర్వాకంపై మండిపడ్డారు. మేకెదాటు కోసం కర్ణాటక చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా కావేరీ హక్కులను పరిరక్షించాలని రామదాస్ ప్రభుత్వాన్ని కోరారు. తమిళనాడు మౌనం దాని జల హక్కులను శాశ్వతంగా కోల్పోయేలా చేస్తుందని హెచ్చరించారు. కర్ణాటక చేస్తున్న తప్పుడు కథనాలను ఎదుర్కోవాలని, దేశానికి నిజమైన చట్టపరమైన వాస్తవాలను తెలియ జేయాలని, ఏకీకృత వ్యూహాన్ని రూపొందించడానికి తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అన్బుమణిపిలుపునిచ్చారు. మేకెదాటు ఆనకట్ట నిర్మాణానికి కర్ణాటక చేస్తున్న తీవ్ర ప్రయత్నాల మధ్య ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు. ,రాష్ట్ర కావేరీ నదీ హక్కులను పరిరక్షించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని పిఎంకె అధ్యక్షుడు కోరారు.
మైసూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వును తప్పుగా అన్వయించి, అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తానని కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ చేసిన ప్రకటనను ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ ప్రాజెక్టు తమ రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని రాష్ట్రం అంగీకరించడం, సాగునీటి కోసం నీటిని మళ్లించాలనే దాని అసలు ఉద్దేశాన్ని బట్టబయలు చేస్తోందని, ఈ జలాశయం కేవలం తాగునీటి అవసరాల కోసమేనన్న దాని మునుపటి వైఖరికి ఇది విరుద్ధంగా ఉందని ఆయన అన్నారు. ఈ మార్పు కర్ణాటక సమర్పించిన వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక ను నేరుగా చెల్లనిదిగా చేస్తుందన్నారు. ఈ ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరించడానికి కేంద్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు తగిన కారణాలను అందిస్తుందన్నారు. ముంపు ప్రాంతంపై కర్ణాటక చేసిన సవరించిన అంచనా 5,000 హెక్టార్ల నుండి 5,400 హెక్టార్లకు పెరగడం, ప్రణాళిక ప్రకారం నిర్దేశించిన 67 టీఎంసీల కంటే చాలా ఎక్కువ నీటిని జలాశయం నిల్వ చేస్తుందని సూచిస్తోందని, ఇది పర్యావరణానికి, వన్యప్రాణులకు విపత్కర ముప్పును కలిగిస్తుందని పేర్కొన్నారు రామదాస్.
