కరీంనగర్ జిల్లా : ఎంపీ ఈటల రాజేందర్ కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన 13 ఏళ్ల బాల మేధావి సృష్టి సాయి ప్రదర్శించిన సాంకేతిక ప్రతిభను చూసి ప్రశంసించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో మొబైల్ కంట్రోల్ , వైఫై ఆధారిత ఫ్లాగ్ హోస్టింగ్ సిస్టమ్‌ను రూపొందించి అందరినీ ఆశ్చర్య పోయేలా చేశాడు. చిన్న వయసులోనే అద్భుతమైన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. ఈ పిన్న వయసులోనే సాంకేతికతపై తనకున్న పట్టును నిరూపించుకున్న సృష్టి సాయిని ఘనంగా సన్మానించారు ఈ సందర్బంగా ఎంపీ.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వంలో దేశం డిజిటల్ విప్లవం వైపు వేగంగా అడుగులు వేస్తోందన్నారు ఈటల రాజేందర్. ‘డిజిటల్ ఇండియా’ దార్శనికతతో పాటు, యువతలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , రోబోటిక్స్ రంగాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. మోదీ ప్రోత్సాహంతో భారత్ నేడు కేవలం టెక్నాలజీని వినియోగించే దేశంగానే కాకుండా, కొత్త టెక్నాలజీలను సృష్టించే గ్లోబల్ హబ్‌గా మారుతోందని అన్నారు. ఈ తరుణంలో మన దేశ యువత ఏఐ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు ఎంపీ.
నేటి విద్యార్థులు కేవలం సాంప్రదాయ చదువులకే పరిమితం కాకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా ఏఐ, కోడింగ్ , సాంకేతిక నైపుణ్యాలను అలవర్చుకోవాలని సూచించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు ఎంపీ. రాబోయే రోజుల్లో సృష్టి సాయి మరిన్ని ఆవిష్కరణలు చేయాలని , ఎంతో మంది విద్యార్థులకు, యువతకు మార్గదర్శకంగా నిలవాలని ఆకాక్షించారు ఈటల రాజేందర్.
