వైఎస్స్ఆర్ కడప జిల్లా : మాజీ సీఎం, వైసీపీ బాస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. బుధవారం ఆయన పులివెందుల నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మరికవలస గిరిజన పాఠశాల తరలింపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని మరికవలస గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలను ఒక ప్రైవేట్ కోచింగ్ సంస్థ భాగస్వామ్యంతో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ గా మార్చాలన్న కూటమి ప్రభుత్వ వివాదాస్పద నిర్ణయం తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నిర్ణయం వల్ల విద్యా సంవత్సరం మధ్యలోనే వందలాది మంది గిరిజన విద్యార్థులను హఠాత్తుగా తరలించాల్సి వచ్చింది. దీనిపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, గిరిజన సంఘాల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. నిరసన తెలుపుతున్న కుటుంబాలకు సంఘీభావం తెలిపేందుకు మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణితో సహా ప్రతిపక్ష నాయకులు అక్కడికి వెళ్లడానికి ప్రయత్నించారు.
దీంతో పోలీసులు వారిని గృహ నిర్బంధం చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాలను తీవ్రంగా ఖండించారు జగన్ మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ విధానం వెనుక ఉన్న కారణాలు , ప్రజాస్వామ్య బద్ధమైన నిరసనను అణచి వేయడం వంటి అంశాలపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. పోలీసు చర్యను తప్పుబడుతూ మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి పట్ల మీరు ఎలా అనుచితంగా ప్రవర్తిస్తారు? వారి గొంతుకను అణచి వేయడానికి పోలీసు బలగాలను ఉపయోగించే స్థాయికి దిగజారిపోయారా? అని నిప్పులు చెరిగారు .అన్ని చోట్లా తమ పార్టీ నాయకులను ఎందుకు గృహ నిర్బంధం చేస్తున్నారు అని జగన్ ప్రశ్నించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, గిరిజన సంఘాలు నిరసన తెలుపుతుంటే వారి అభ్యంతరాలను వినే ఓపిక కూడా ఈ ప్రభుత్వానికి లేదా? అసలు ఈ గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలను తరలించాల్సిన అవసరం ఏముంది?” అని ఆయన నిలదీశారు.
