పర్యాటకుల కోసం హోటళ్లు, హోంస్టేలు పెంచేలా కార్యాచరణ

పర్యాటక శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి : రాష్ట్రంలో పెరుగుతోన్న పర్యాటకుల ఫుట్ ఫాల్‌కు అనుగుణంగా ఏపీలో హోటల్ గదులు, హోం స్టేలను త్వరితగతిన అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యాటక శాఖకు దిశానిర్దేశం చేశారు. 2029 నాటికి రాష్ట్రంలో 50 వేల హోటల్ గదుల నిర్మాణం లక్ష్యాన్ని చేరుకోవాలని సీఎం సూచనలు జారీ చేశారు. అలాగే వివిధ పర్యాటక ప్రాంతాల్లో 10 వేలకు పైగా హోం స్టేలు కూడా అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు. హోంస్టేలను అందుబాటు లోకి తీసుకువచ్చే అంశంపై ఎలాంటి పరిమితీ లేదని వివరించారు. క్యాంపు కార్యాలయంలో పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సమీక్షకు మంత్రి కందుల దుర్గేష్, ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ సహా పర్యాటక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదం తెలియజేసిన టూరిజం ప్రాజెక్టులు వేగంగా ఏర్పాటు అయ్యేలా చూడాలని సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలు, నగరాల్లో జాతీయ, అంతర్జాతీయ హోటల్ బ్రాండ్లు వచ్చేలా చూడాలని సూచించారు. గోదావరి పుష్కరాల నాటికి కూడా రాజమహేంద్రవరం సహా వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హోం స్టేల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. హోం స్టేల నిర్వహణకు సంబంధించి రేటింగ్ కూడా పెట్టాలని దిశానిర్దేశం చేశారు. అరకు, చింతపల్లి, ముంచింగిపుట్టు, గాంధీవనం, మారేడుమిల్లి తదితర ప్రాంతాలతో పాటు కనీసం 10-15 ప్రాంతాల్లో కారావాన్ పార్కులను ఏర్పాటు చేయాలని సూచించారు. కారావాన్లను పార్కింగ్ చేసుకుని కుటుంబంతో సురక్షితంగా ప్రకృతిని ఆస్వాదించేలా ఆయా పార్కుల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!