2028 నాటికి ప్రతీ ఇంటికీ సురక్షిత తాగునీరు

సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌ట‌న

అమరావతి : హర్ ఘర్ జల్ కార్యక్రమంలో భాగంగా ప్రతీ పల్లెకు, ప్రతీ ఇంటికీ సురక్షిత తాగునీటిని నిరంతరాయంగా అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జల్ జీవన్ మిషన్ 2.0 కింద 2028 నాటికి రాష్ట్రంలోని ప్రతీ ఇంటికీ తాగునీటి కుళాయి లక్ష్యాన్ని సాకారం చేస్తామని ఆయన వెల్లడించారు. జల్ జీవన్ మిషన్ 2.0 పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఢిల్లీలో కుదిరిన ఎంఓయూ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థ ఆపరేషన్, మెయింటెనెన్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని సీఎం పేర్కొన్నారు. దీనికి సంబంధించి 2025 సెప్టెంబర్‌లోనే సమగ్ర విధానాన్ని ప్రకటించినట్టు గుర్తు చేశారు. తాగునీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ బాధ్యతను పంచాయతీలకు అప్పగించామని చెప్పారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జల్ జీవన్ మిషన్ అమలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని అన్నారు. జల్ జీవన్ మిషన్ 2028 వరకు కొనసాగిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనికి కేంద్రం సహకరించాలని ఈ సందర్భంగా సీఆర్ పాటిల్‌ను సీఎం కోరారు. జల్ జీవన్ మిషన్ 2.0 ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం అనంతరం సీఆర్ పాటిల్ మాట్లాడారు. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు జల్ జీవన్ మిషన్ 2.0కు అనుమతులు ఇచ్చామని చెప్పారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో ఈ విషయంపై సంప్రదించారని, ఈ మిషన్ పొడిగింపు కోసం ప్రతిపాదించడంపై పాటిల్ ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!