రైల్వే మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం
రూ.23,437 కోట్ల అంచనా వ్యయంతో కీలక ప్రాజెక్టులు
అమరావతి : కేంద్ర సర్కార్ ఏపీ రాష్ట్రానికి తీపికబురు చెప్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ భారత రైల్వే నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేలా రూ. 23,437 కోట్ల అంచనా వ్యయంతో 3 కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 901 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్లు (3వ, 4వ లైన్లు) నిర్మించనున్నారు. గుంతకల్ – వాడి (3వ , 4వ లైన్). ఇది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక , తెలంగాణ రాష్ట్రాల గుండా సాగుతుంది. నాగ్దా – మథుర (3వ , 4వ లైన్) మధ్యప్రదేశ్, రాజస్థాన్ , ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతుంది. బుర్హ్వాల్ – సీతాపూర్ (3వ , 4వ లైన్) ఉత్తరప్రదేశ్‌లో రద్దీని తగ్గిస్తుంది. వీటిని చేపట్టేందుకు మంత్రివర్గం రూ. 23 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. 2030-31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారరు. ఈ నిధులతో ఆరు రాష్ట్రాలు ప్రయోజనం పొందనున్నాయి. 19 జిల్లాలు, 4,161 గ్రామాలు , సుమారు 83 లక్షల జనాభాకు మేలు జరుగుతుంది. అంతే కాకుండా ఏడాదికి అదనంగా 60 మిలియన్ టన్నుల (MTPA) సరుకు రవాణా సామర్థ్యం పెరుగుతుంది.
పారిశ్రామిక వృద్ధికి సంబంధించి బొగ్గు, ఆహార ధాన్యాలు, సిమెంట్ , ఇనుము వంటి వస్తువుల రవాణా వేగవంతం అవుతుంది. పర్యాటక రంగానికి కూడా ఊతం లభిస్తుంది. మంత్రాలయం (రాఘవేంద్ర స్వామి మఠం), కాసాపురం ఆంజనేయ స్వామి ఆలయం, మథుర, బృందావనం, మహాకాళేశ్వర్ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు రవాణా సౌకర్యం మెరుగు పడుతుంది. రైల్వే రవాణా పెరగడం వల్ల సుమారు 37 కోట్ల లీటర్ల చమురు దిగుమతి తగ్గుతుంది. 185 కోట్ల కిలోల CO_2 ఉద్గారాలు తగ్గుతాయి. ఇది 7 కోట్ల మొక్కలు నాటడంతో సమానం. ఈ ప్రాజెక్టులు ‘పీఎం-గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్’ కింద రూపుదిద్దుకున్నాయి, ఇది సమగ్ర మౌలిక సదుపాయాల కల్పనకు దోహద పడుతుంది.ఈ మల్టీ-ట్రాకింగ్ పనుల వల్ల రైళ్ల రాకపోకల్లో జాప్యం తగ్గి, ప్రయాణికులకు, వ్యాపారస్తులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో కనెక్టివిటీ మరింత మెరుగవుతుంది.
