తెలంగాణ పాలిట శాపంగా మారిన రేవంత్ రెడ్డి

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ : మాజీ మంత్రి హ‌రీశ్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. తెలంగాణ రాష్ట్ర జ‌ల హ‌క్కుల‌ను ఏపీకి తాక‌ట్టు పెడుతున్నాడ‌ని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు త‌మ వ‌ద్ద ఉన్నాయ‌న్నారు. నదీ జలాలపై కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి అజ్ఞానం.. నేడు తెలంగాణకు మరణ శాసనంగా మారిందన్నారు. కేసీఆర్ పోరాడి సాధించిన ప్రాజెక్టుల అనుమతులను గాలికి వదిలేసి తన రాజకీయ స్వార్థం కోసం రాష్ట్ర భవిష్యత్తును రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దల కాళ్ల దగ్గర తాకట్టు పెడుతున్నాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కర్ణాటక, ఏపీ అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణను ముంచుతుంటే.. అడ్డుకోవాల్సిన సీఎం వారితో కలిసి సంబరాలు చేసుకోవడం దారుణ‌మ‌న్నారు. మంత్రి ఉత్తమ్‌ను బయట పెట్టి ఏపీ అధికారితో సీక్రెట్ మీటింగ్ లో ముగ్గురు సీఎంలు చేసుకున్న ఆ ‘చీకటి ఒప్పందం’ ఏంటో రేవంత్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

నదుల అనుసంధానం పేరిట ఏపీ జలదోపిడీకి రెడ్ కార్పెట్ వేస్తూ.. తెలంగాణ సమ్మక్క సాగర్ ప్రాజెక్టును రేవంత్ బలిపెడుతున్నాడ‌ని అన్నారు హ‌రీశ్ రావు. కూలగొట్టే హైడ్రాకు ‘హిట్లర్’ స్ఫూర్తన్న రేవంత్ రెడ్డి.. మన నీళ్లు ఎత్తుకు పోతుంటే ఫిడేల్ వాయించిన ‘నీరో చక్రవర్తి’లా చోద్యం చూస్తున్నాడని మండిప‌డ్డారు. కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్లలో ఏకంగా 383 టీఎంసీల అనుమతులు సాధిస్తే.. ఈ కాంగ్రెస్ సర్కార్ రెండున్నరేళ్లలో కనీసం ఒక్క టీఎంసీకి కూడా అనుమతి సాధించిన పాపాన పోలేద‌న్నారు. కర్ణాటక ప్రభుత్వం తుంగభద్రకు దిగువన, RDS కు ఎగువన 35 టీఎంసీల సామర్థ్యంతో ‘నవేలి రిజర్వాయర్‘ నిర్మాణానికి పూనుకుంద‌ని ఆరోపించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్డీఎస్ దిగువన, సుంకేసుల ఎగువన 20 టీఎంసీల సామర్థ్యంతో ‘గుండ్రేవుల’ ప్రాజెక్టు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింద‌న్నారు. మ‌రి సీఎంగా ఉండి నిద్ర పోతున్నారా అని ప్రశ్నించారు హ‌రీశ్ రావు.

Leave A Reply

Your Email Id will not be published!