వచ్చే ఏడాదికల్లా వెలిగొంగ ప్రాజెక్టును పూర్తి చేస్తాం
సంచలన ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఆరు నూరైనా సరే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నిధులకు కొరత లేదని, ఇప్పటికే ప్రకటించిన మేరకు వెలిగొండ ప్రాజెక్టును వచ్చే ఏడాది నాటికి పూర్తి చేస్తామని అన్నారు. యర్రగొండ నియోజకవర్గ గంటవానిపల్లెలో వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని రైతులు, నిర్వాసితులతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. ప్రాజెక్టుకు భూములివ్వడం అంటే త్యాగం చేసినట్టేనని అన్నారు.పూర్వీకుల నుంచి వచ్చిన భూములను ప్రాజెక్టు కోసం వదులుకున్నారని ప్రశంసించారు. వెలిగొండ ప్రాజెక్టు నాలుగు జిల్లాల తలరాతను మారుస్తుందన్నారు సీఎం. ఈ ప్రాంత నీళ్లల్లో ఫ్లోరైడ్ సమస్యలు ఉన్నాయి.. దీంతో ఇక్కడి స్థానికులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు. మార్కాపురం ప్రాంతం అంటే కరవు ప్రాంతమని పేరు… ఈ ప్రాంతానికి కృష్ణా నీళ్లు వస్తాయని ఎవ్వరూ అనుకోలేదని చెప్పారు.
మార్కాపురం ప్రాంతానికి కృష్ణా నీళ్లిచ్చేందుకు ఎన్టీఆర్ 1985లోనే ఆలోచన చేశారని అన్నారు. దీని కోసం ఓ కమిటీని వేశామన్నారు. ఎన్టీఆర్ హయాంలో వెలిగొండ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని వెల్లడించారు.1995లో ప్రకాశం జిల్లా పర్యటనకు ఎప్పుడు వచ్చిన సమయంలో వెలిగొండ ప్రాజెక్టు గురించే అడిగేవాళ్లు. వరద వస్తే.. ఆ జలాలను మళ్లిస్తే ఆ నీళ్లతో తాము జీవనం సాగిస్తామని ఇక్కడి రైతులు చెప్పేవారని గుర్తు చేశారు. 1996లో వెలిగొండకు శంకుస్థాపన చేశాం. ఈ ప్రాజెక్టుకు ప్రస్తుత లెక్కల ప్రకారం రూ. 10,580 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామన్నారు. ఇప్పటి వరకు రూ. 6,736 కోట్లు ఖర్చు చేశాం… ఇంకా రూ.3,844 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉందన్నారు.
