తిరుపతి : అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా మేదిని పూజ నిర్వహించి, అనంతరం సేనాధిపతి ఉత్సవాన్ని చేపట్టారు. సంప్రదాయం ప్రకారం శ్రీ విష్వక్సేనులవారు నాలుగు మాడవీధుల్లో విహరించి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించి, అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగేలా అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. అనంతరం యాగశాలలో అంకురార్పణ నిర్వహించి బ్రహ్మోత్సవాలకు మంగళారంభం పలికారు. గురువారం ఉదయం 8.30 గంటల నుండి 9.00 గంటల మధ్య కర్కాటక లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 8 గంటల వరకు స్వామివారు వివిధ దివ్య వాహనాలపై విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. 26న చిన్నశేష వాహనం, హంస వాహనం , 27న సింహ వాహనం, ముత్యపు పందిరి వాహనం, 28న కల్పవృక్ష వాహనం, కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం, 29న మోహినీ అవతారం, గరుడ వాహనం, 30న హనుమంత వాహనం, గజ వాహనం జరుగుతుంది. జూలై 1న సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, 2న రథోత్సవం, అశ్వవాహనం, 3న చక్రస్నానం, ధ్వజావరోహణం నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది.
బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక ప్రసంగాలు, భక్తి సంగీత కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించి భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించనున్నారు. ఈ కార్యక్రమంలో కంకణ భట్టర్ శ్రీ సూర్యకుమార్ ఆచార్యులు, టిటిడి డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, వీజీవో వి.గిరిధర్, అదనపు హెల్త్ ఆఫీసర్ డా. సునీల్, ఏవీఎస్వో రాధాకృష్ణ, టెంపుల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.
