అమరావతి:- జువ్వలదిన్నె హార్బర్ నిర్మాణంపై జగన్ దుష్ప్రచారం చేస్తున్నాడని, మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బ తీసిన వ్యక్తి మత్స్యకారుల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదని రాష్ట్ర గనులు, భూగర్భ శాస్త్ర శాఖ మంత్రి కొల్లు రవింద్ర మండిపడ్డారు. గురువారం మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న నెల్లూరు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి మరోసారి తన అసహనాన్ని బయట పెట్టాడని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి జరుగుతుండటం తట్టుకోలేక, వివిధ వర్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు మంత్రి. ఎక్కడైనా అవకాశం దొరికితే అల్లర్లు రేపాలనే ధోరణి ఆయన వ్యవహారంలో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ విషయంలో కూడా ఆయన దుష్ప్రచారానికి దిగారని ఆరోపించారు కొల్లు రవీంద్ర. మత్స్యకారులను రెచ్చగొట్టేందుకు అసత్యాలు ప్రచారం చేశారన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఈ హార్బర్ నిర్మాణానికి నిధులు, బిల్లులు ఇవ్వకుండా అడ్డుకున్నాడని మండిపడ్డారు. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని అక్కడికి వెళ్లాడని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు వేగవంతమై, ప్రాజెక్టు దాదాపు పూర్తి స్థాయికి చేరుకుందన్నారు మంత్రి. 901 మీటర్ల జెట్టీ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్, కోల్డ్ స్టోరేజీలు, వలల భద్రత కోసం గదులు వంటి అన్ని సౌకర్యాలతో ఆధునిక హార్బర్‌గా దీనిని అభివృద్ధి చేస్తున్నామన్నారు కొల్లు రవీంద్ర.
