అమరావతి : ఏపీకి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కీలకమైన పదవిని కట్టబెట్టింది కేంద్రంలోని బీజేపీ కూటమి సర్కార్. ఆయనను తమిళనాడు గవర్నర్ గా నియమించింది. ప్రస్తుతం అక్కడ సీఎం జోసెఫ్ విజయ్ సారథ్యంలోని టీవీకే కూటమి ప్రభుత్వం కొలువు తీరి ఉంది. ఎమ్మెల్యే నుంచి గవర్నర్ వరకు ఎదిగారు. ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ చీఫ్ విప్‌గా (2004-2009), ఆ తర్వాత 2009లో ఏపీ శాసనసభ స్పీకర్‌గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత కాలంలో మళ్లీ కాంగ్రెస్‌లోకి పునరాగమనం చేసినప్పటికీ, ఏప్రిల్ 2023లో భారతీయ జనతా పార్టీ లో చేరి తమ రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్రాన్ని విభజించకండి.. సమైక్య ఆంధ్రప్రదేశ్‌ను కాపాడండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో దేశ వ్యాప్తంగా కిరణ్ కుమార్ రెడ్డి వైరల్ గా మారారు.
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీని వీడారు. ఆ తర్వాత జై సమైక్యాంధ్ర పార్టీ ఏర్పాటు చేశారు. పెద్దగా స్పందన రాలేదు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ కాంగ్రెస్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఇక ఇక్కడ తనకు గుర్తింపు రావడం లేదని బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 1960 సెప్టెంబర్ 13న హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. ఆయన తండ్రి నల్లారి అమర్నాథ్ రెడ్డి కూడా కాంగ్రెస్ రాజకీయాల్లో కీలకంగా పనిచేశారు. తను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నారు. తర్వాత సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. నిజాం కాలేజీ నుంచి డిగ్రీ , ఉస్మానియా యూనివర్సిటీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా నుంచి లా చదివారు. రాజకీయాల్లోకి రాక ముందు కిరణ్ కుమార్ రెడ్డికి క్రికెట్‌పై ఎంతో ఆసక్తి ఉండేది. కాలేజీ రోజుల్లో క్రికెట్ ఆడారు. హైదరాబాద్ అండర్-22 జట్టుకు, సౌత్ జోన్ యూనివర్సిటీ జట్టుకు, ఉస్మానియా యూనివర్సిటీ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. హైదరాబాద్ తరఫున రంజీ ట్రోఫీలో కూడా ఆడారు.మాజీ భారత క్రికెట్ కెప్టెన్ , ప్రస్తుత మంత్రి మొహమ్మద్ అజహరుద్దీన్ ఆయనకు కాలేజీ సహచరుడు.
