హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు నిప్పులు చెరిగారు. రాష్ట్రలో కొలువు తీరిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వాకం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ప్రజా పాలన పేరుతో జనాన్ని బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను పట్టించుకోక పోవడం దారుణమన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రభుత్వ భూములను అమ్ముకునే రియల్ ఎస్టేట్ ఏజెన్సీగా మారి పోయిందని సంచచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ లోని అజామాబాద్‌లో రూ. 500 కోట్ల విలువైన ప్రభుత్వ ‘ఆయిల్‌ఫెడ్’ భూమిని కేవలం రూ. 87 కోట్లకే ఒక ప్రైవేట్ వ్యక్తికి ధారాదత్తం చేయడం వెనుక ఉన్న మతలబు ఏంటి? అని ప్రశ్నించారు హరీష్ రావు.
ఆ డబ్బులు చెల్లించడానికి ఆయిల్‌ఫెడ్ సంస్థ సిద్ధంగా ఉన్నా కాదని సుప్రీంకోర్టు తీర్పులను సైతం తుంగలో తొక్కి కారుచౌకగా ప్రైవేట్ పరం చేయడం దారుణం కాక మరేమిటి అని ప్రశ్నించారు. గత పదేళ్ల పాలనలో ఈ వందల కోట్ల ఆస్తిని ప్రైవేట్ శక్తుల పాలు కాకుండా మేము చిత్తశుద్ధితో కాపాడాం. కానీ నేడు మీరు సామాన్యుల ఆస్తులను 22A పేరుతో లాక్కుంటూ, ప్రభుత్వ భూములను పెద్దలకు పల్లీలు, బఠానీల్లా దోచిపెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఈ అక్రమ కేటాయింపును రద్దు చేసి, ఆ 15,984 గజాల భూమిని ఆయిల్‌ఫెడ్ సంస్థకే దక్కేలా ఫ్రీహోల్డ్ హక్కులు కల్పించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అప్పటి వరకు బీఆర్ఎస్ పక్షాన మా పోరాటం ఆగదని ప్రకటించారు. వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని హెచ్చరించారు మాజీ మంత్రి.
