హైదరాబాద్ : పల్లె సీమలు బాగు పడితేనే నిజమైన అభివృద్ది అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఆదివారం ఆయన పల్లె పల్లెకు పొన్నన్న – ప్రతి గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. వీరభద్రనగర్ గ్రామంలో ప్రజలను కలిసి, వారి సమస్యలను తెలుసుకుని, అధికారులతో సమీక్ష జరపడం ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. , ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి వీరభద్రనగర్ గ్రామాన్ని సందర్శించానని తెలిపారు. గ్రామ అభివృద్ధి , సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలు సమర్పించిన వినతులను పరిష్కరించడానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
భూ సేకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి అనుమతి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. తాగునీటి బావిలో పూడిక తీయడం , పైప్‌లైన్ ఏర్పాటుతో పాటు, పొలాల్లో సిసి (CC) రోడ్లు, బోరుబావులు, మోటార్లు, పైప్లైన్లు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మూతపడిన ప్రభుత్వ పాఠశాలను ఈ ఏడాదే తిరిగి ప్రారంభించామన్నారు పొన్నం ప్రభాకర్ గౌడ్. పాఠశాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, రంగులు వేయడం వంటి పనుల ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.
వీరభద్రనగర్‌లో ఇప్పటికే క్రీడా పరికరాలు, ఓపెన్ జిమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. . యువత మొబైల్ ఫోన్లకు బానిసలు కాకుండా, క్రీడా మైదానాలకు వెళ్లి కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ వంటి క్రీడలలో రాణించాలని సూచించారు. నీటి సంరక్షణ కోసం ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించు కోవాలని, అలాగే రైతులు కరువును తట్టుకునే పంటలు , ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాలని కోరారు. కొత్త పెన్షన్లకు అర్హులైన వారు ఈ నెల 31వ తేదీలోపు తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.
